86మంది ప్రాణాలు గాల్లో.. స్పైస్ జెట్ విమానంలో టెన్షన్ టెన్షన్

ఎమర్జెన్సీ అంటూ కాక్ పిట్ నుంచి సందేశం రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. ఆ ఆరు నిముషాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు.

Advertisement
Update: 2022-10-13 09:29 GMT

గోవానుంచి 86మంది ప్రయాణికులతో స్పైస్ జెట్ విమానం గత రాత్రి హైదరాబాద్ బయలుదేరింది. మరో ఆరు నిముషాల్లో ల్యాండింగ్. అంతలోనే ఒక్కసారిగా కాక్ పిట్ లోనుంచి పొగలొచ్చాయి. అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (AOCC) నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ద్వారా పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని సూచిస్తూ సిస్టమ్స్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (SOCC)కి మెసేజ్ వెళ్లింది. విచిత్రం ఏంటంటే.. ఈ మెసేజ్ వెళ్లి, అధికారులు అప్రమత్తమయ్యే లోపు విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది. రాత్రి 10.52 గంటలకు అత్యవసర పరిస్థితిని ప్రకటించగా, 10.58 గంటలకు విమానం సేఫ్ గా హైదరాబాద్ లో ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ ఆరు నిమిషాలు నరకం..

విమానం నుంచి పొగలు రావడంతో ఓ ప్రయాణికురాలు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. దీంతో వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఎమర్జెన్సీ అంటూ కాక్ పిట్ నుంచి సందేశం రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. ఆ ఆరు నిముషాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. అప్పటికి ఫ్లైట్ ఇంకా గాల్లోనే ఉండటంతో.. 86మంది ఊపిరి బిగబట్టి సీట్లకు అతుక్కుపోయారు. హైదరాబాద్ లో విమానం దిగగానే హడావిడిగా బయటపడ్డారు. బతుకు జీవిడా అనుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు.

SG-3735 విమానం అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో హైదరాబాద్ లో అదే సమయానికి దిగాల్సిన 9 విమానాలను దారి మళ్లించారు. వీటిలో ఆరు డొమెస్టిక్ ఫ్లైట్ లు ఉండగా, రెండు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, ఒకటి కార్గో విమానం. హైదరాబాద్ విమానాశ్రయంలో రాత్రి 11 గంటల సమయంలో ఏం జరుగుతుందోననే టెన్షన్ ఉండటంతో 9 విమానాలను దారి మళ్లించారు. అయితే స్పైస్ జెట్ విమానం సురక్షితంగా దిగడంతో ఆ తర్వాత ఎమర్జెన్సీ పరిస్థితిని ఉపసంహరించుకున్నారు. విమానానికి ప్రమాదమేమీ లేకపోవడం, ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో స్పైస్ జెట్ దీనిపై ఇంకా స్పందించలేదు.

Tags:    
Advertisement

Similar News