మల్లన్న సాగర్ బాధితులకు అదనంగా మరో రూ. 5 లక్షల పరిహారం..
మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోయిన యెల్లరెడ్డి పేట, తొగుట మండలాల్లోని తుక్కాపూర్, ఘన్ పూర్, బండారుపల్లి గ్రామాల రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 8 లక్షల చొప్పున ఇప్పటికే పరిహారం చెల్లించింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మల్లన్న సాగర్ కాల్వ నిర్మాణ పనులకు ఉన్న అడ్డంకులన్ని ప్రభుత్వం తొలగించుకుంటుంది. కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.13 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా అదనంగా ఒక టీఎంసీ (థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్) నీళ్లను గ్రావిటీ ద్వారా మల్లన్న సాగర్ లోకి పంపింగ్ చేయడానికి ఉద్దేశించారు.
అయితే మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోయిన యెల్లరెడ్డి పేట, తొగుట మండలాల్లోని తుక్కాపూర్, ఘన్ పూర్, బండారుపల్లి గ్రామాల రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 8 లక్షల చొప్పున ఇప్పటికే పరిహారం చెల్లించింది. దీనికి సంతృప్తి చెందని రైతులు తమకు ఇంకా కొంత మొత్తం చెల్లించాలని సీసీఎల్ ఏ ఆవరణలో ఉన్న రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్ మెంట్ కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా నాలుగు గ్రామాలకు చెందిన 531 మంది రైతులకు అదనంగా మరో రూ. 5 లక్షలు చెల్లించడానికి ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. దీంతో ప్రభుత్వం ఒక్కొక్కరికి ఎకరాకు రూ.13 లక్షలు చెల్లిస్తుంది. రైతులతో పాటు రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్ మెంట్ కోర్టుకు వచ్చిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించినందుకు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి త్యాగానికి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు.