జనాభాలో మీరు అరశాతం.. అసెంబ్లీలో రేవంత్ సెటైర్లు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై తమకు ఎలాంటి అనుమానం లేదని, సహవాస దోషం అన్నట్టుగా కొంతమంది ఆయన పక్కన కూర్చుని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Advertisement
Update: 2024-02-16 11:32 GMT

కులగణన విషయంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో తీర్మానాన్ని సభ ముందుకు తీసుకొచ్చామన్నారు. బలహీన వర్గాలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పారు రేవంత్ రెడ్డి.


గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టారా? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. చర్చను ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. కులగణన అమలుచేసే క్రమంలో అనుమానముంటే ప్రతిపక్షాలు సూచనలివ్వాలని చెప్పారు. తీర్మానానికే చట్టబద్ధత లేదన్నట్లుగా మాట్లాడటం మంచిది కాదన్నారు. తామేమీ రహస్యంగా కులగణన చేపట్టలేదని వివరించారు. రాష్ట్ర జనాభాలో అరశాతం ఉన్నవాళ్లకు ఈ తీర్మానంపై బాధ ఉండొచ్చని సెటైర్లు పేల్చారు. రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్న ఆ అరశాతం నాయకులు.. లెక్కలు బయటకు వస్తే జనాభాలో 50 శాతం ఉన్న వర్గాలకు ఎక్కడ రాజ్యాధికారం ఇవ్వాల్సి వస్తుందోననే బాధలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

కడియంది సహవాస దోషం..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై తమకు ఎలాంటి అనుమానం లేదని, సహవాస దోషం అన్నట్టుగా కొంతమంది ఆయన పక్కన కూర్చుని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలన్నారు. పాలితులుగా ఉన్నవారిని పాలకులుగా తయారుచేయడమే తమ ఉద్దేశమన్నారు రేవంత్ రెడ్డి. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించి వారి ఆర్థిక ప్రయోజనాలను నిలబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News