టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళణ.. ఢిల్లీలో రేవంత్ ప్రణాళిక

ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు రక్షణమంత్రి రాజ్‌ నాథ్‌ తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్‌ సమస్యలపై ఆయనతో చర్చించారు.

Advertisement
Update: 2024-01-05 13:58 GMT

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళణ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్‌ మనోజ్‌ సోనీతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ చైర్మన్‌ తో చర్చించారు. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ను పకడ్బందీగా తీర్చిదిద్దుతామని ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రశ్నపత్రాల లీకేజీకి అవకాశం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. యూపీఎస్సీ చైర్మన్ తో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి కూడా పాల్గొన్నారు.

రెండోరోజు వరుస భేటీలు..

ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలిరోజు కేంద్ర మంత్రులు, అమిత్‌ షా, హర్‌ దీప్‌ సింగ్‌ పురి, గజేంద్రసింగ్‌ షెకావత్‌ తో విడివిడిగా భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. రెండో రోజు రక్షణమంత్రి రాజ్‌ నాథ్‌ తో సమావేశమయ్యారు. రక్షణ శాఖ భూములు, కంటోన్మెంట్‌ సమస్యలపై ఆయనతో చర్చించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గంటసేపు పలు అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి బీఆర్జీఎఫ్ కింద రావలసిన రూ.1800 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో ఉందని, వెంటనే తగిన ఆర్థిక సహాయం చేయాలని నిర్మలా సీతారామన్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. 

Tags:    
Advertisement

Similar News