ఏడాదిలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.. అర్హులు వీళ్లే..

6 గ్యారంటీల అమలుకు రేవంత్‌ సర్కారు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించన విషయం తెలిసిందే. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

Advertisement
Update: 2024-02-11 03:04 GMT

తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రేవంత్‌ ప్రభుత్వం నిర్ణయించింది. 6 గ్యారంటీల అమలులో భాగంగా ఇళ్లు లేని వాళ్లకు ఇంటి స్థలం, స్థలం ఉన్నవాళ్లకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం అందించాలనే నిర్ణయానికొచ్చింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4,16,500 ఇళ్లు నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణం కోసం రూ.7,740 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

గత ప్రభుత్వం కూడా గృహలక్ష్మి పేరుతో ఇంటి నిర్మాణ పథకాన్ని తీసుకొచ్చింది. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. బడ్జెట్‌లో 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. కానీ ఈ పథకం కార్యరూపం దాల్చలేదు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, సానుభూతి పరులనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారనే విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది. అంతా మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. పాత లబ్ధిదారులు కూడా మళ్లీ అప్లయ్ చేసుకోవాల్సిందే అని ప్రకటించింది.

ఎన్నికల హామీ మేరకు ఒక్కో లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. అంటే గత ప్రభుత్వం కంటే 2 లక్షల రూపాయలు అదనం. అందుకు తగినట్లుగానే బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన విధివిధానాల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తారని సమాచారం. గత ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల్లోనూ కొన్నింటిని పరిశీలిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించనుంది.

6 గ్యారంటీల అమలుకు రేవంత్‌ సర్కారు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించన విషయం తెలిసిందే. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే వడపోత ప్రక్రియ పూర్తయింది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఏయే సామాజికవర్గాలకు ఎన్ని ఇళ్లు ఇవ్వాలి?. ఏ ప్రాతిపదికన కేటాయించాలి?. అనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని సమాచారం. అనంతరం పథకాన్ని అమలు చేస్తారు.

Tags:    
Advertisement

Similar News