రాజాసింగ్ కేసు: ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు కాదా ?

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్టు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటికి వెళ్లేప్పుడు ర్యాలీలు నిర్వహించవద్దు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దు'' అని హైకోర్టు ఆయనకు ష‌రతులు విధించింది. అయితే ఆయన ఈ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement
Update: 2022-11-10 05:28 GMT

మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ప్రివెంటివ్‌ డిటెన్షన్‌(పీడీ) చట్టం కింద 40 రోజులపాటు జైల్లో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిన్న విడుదలయ్యారు. హైకోర్టు రాజాసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ''జైలు నుంచి బయటికి వెళ్లేప్పుడు ర్యాలీలు నిర్వహించవద్దు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దు'' అని హైకోర్టు ఆయనకు ష‌రతులు విధించింది.

అయితే నిన్న ఆయన జైలు నుండి విడుదలైన క్షణం నుండే కోర్టు ఆదేశాల ధిక్కరణ ప్రారంభమైంది. ఆయనను స్వాగతించడానికి వచ్చిన వందలాది మంది ఆయన అనుచరులు ర్యాలీ తీయడానికి, బాణాసంచా కాల్చడానికి ప్రయత్నించారు. జై శ్రీరాం అ‍ంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారి ప్రయత్నాన్నీ అడుగడుగునా అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలున్నప్పటికి తన అనుచరులను ఆపడానికి రాజా సింగ్ ప్రయత్నం చేయలేదు. ఇక గోషామహల్ లోని ఆయన ఇంటికి వచ్చాక అనుచరులు బాణాసంచా పేల్చి డ్యాన్సులు చేశారు.

మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని కోర్టు ఆదేశించింది కాబట్టి ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని కోర్టు చెప్పినప్పటికీ ఈ రోజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

''నా అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన హిందువులు, అనుచరులు, మద్దతుదారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను'' అని అని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో రాజాసింగ్ పేర్కొన్నారు. శ్రీరాముడు, గోమాత ఆశీర్వాదంతో తాను జైలు నుంచి బయటకు వచ్చినట్లు రాజాసింగ్‌ చెప్పారు.

ఇక ఆయన ఈ రోజు ట్విట్టర్ లో చేసిన పోస్ట్ లో, ''ధర్మం విజయం సాధించింది. మరోసారి మీకు సేవ చేయడానికి వచ్చాను. జై శ్రీరామ్'' అని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలిచ్చి కొన్ని గంటలు కూడా గడవకముందే రాజాసింగ్ కోర్టు ఆదేశాలను ధిక్కరించారని నెటిజనులు విమర్శిస్తుండగా, ఆయన ఎక్కడా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టలేదని ఆయన అనుచరులు సమర్ధించుకుంటున్నారు. మరి ఈ విషయంపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.


Tags:    
Advertisement

Similar News