నేడే రాహుల్ సభ.. ఖమ్మంలో కాంగ్రెస్ బలప్రదర్శన

ప్రియాంక గాంధీ ఎన్నికల బాధ్యురాలిగా తెలంగాణకు వస్తారని భావించినా, తొలి సభకు రాహుల్ గాంధీ మాత్రమే బయలుదేరడం విశేషం.

Advertisement
Update: 2023-07-02 03:50 GMT

తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఖమ్మంలో ఈరోజు సాయంత్రం జరిగే సభను కాంగ్రెస్ బలప్రదర్శనగా భావిస్తున్నారు. రాహుల్ గాంధీ రాక, పొంగులేటి చేరిక, భట్టి పాదయాత్ర ముగింపు.. ఇలా అన్నిటినీ కలిపి అక్కడే కానిచ్చేస్తున్నారు. భారీ జనసమీకరణతో ఖమ్మంలో కాంగ్రెస్ సభను విజయవంతం చేసేందుకు నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారే రాహుల్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టింది. ప్రియాంక గాంధీ ఎన్నికల బాధ్యురాలిగా ఇక్కడకు వస్తారని భావించినా, తొలి సభకు రాహుల్ గాంధీ మాత్రమే బయలుదేరడం విశేషం. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలందరికీ ఢిల్లీలో ఓసారి క్లాస్ తీసుకున్నారు రాహుల్. ఇప్పుడు ఖమ్మం సభలో కార్యకర్తలకు ఎలాంటి ఉపదేశమిస్తారో చూడాలి.


ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు రాహుల్ గాంధీ. అక్కడినుంచి హెలికాప్టర్లో ఖమ్మంకు వస్తారు. ఖమ్మం సభలో రాహుల్ ప్రసంగంపై తెలంగాణ నాయకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలపై రాహుల్ విమర్శలు చేస్తారు. బీఆర్ఎస్ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్న వేళ, దశాబ్ది ఉత్సవాల సంబరాలు ఇటీవలే ముగిసిన సమయంలో.. రాహుల్ ఎలాంటి కామెంట్లు చేస్తారనేది ఆసక్తిగా మారింది. షర్మిల చేరికపై ఈ సభలో రాహుల్ హింట్ ఇస్తారా లేదా అనేది తేలాలి.

భారీ ఏర్పాట్లు..

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల నుంచి కార్యకర్తలు, ప్రజలను తరలించేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. 40 ఎకరాల ప్రాంగణంలో భారీగా సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC