బీఆర్ఎస్ టు కాంగ్రెస్.. కాంగ్రెస్ టు బీజేపీ..?

పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే మూడు పార్టీలు టికెట్లు ఖరారు చేశాయి. బీఆర్ఎస్ తరపున కొప్పుల ఈశ్వరి, కాంగ్రెస్ తరపున గడ్డం వంశీకృష్ణ, బీజేపీ తరపున గోమాస శ్రీనివాస్ తలపడాల్సి ఉంది.

Advertisement
Update: 2024-04-17 09:58 GMT

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో జంపింగ్ లు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. ఈ పార్టీ కాదంటే ఆ పార్టీకి అక్కడ కూడా కుదరదంటే మరో పార్టీకి టికెట్ కోసం జంప్ అవుతున్నారు నేతలు. టికెట్ ఇచ్చినా పార్టీని వీడిన కడియం కావ్య లాంటి ఉదాహరణలు కూడా ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యేకంగా కనపడుతున్నాయి. తాజాగా పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరిన వెంకటేష్ నేత, ఇప్పుడు అదే టికెట్ కోసం బీజేపీలోకి వెళ్తున్నారని తెలుస్తోంది. పెద్దపల్లి టికెట్ రేస్ లో దీన్ని ఓ ట్రిపుల్ జంప్ గా అభివర్ణించొచ్చు.

2019లో పెద్దపల్లి (ఎస్సీ) స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు వెంకటేష్ నేత. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వెంకటేష్ నేత బీఆర్ఎస్ కి దూరమయ్యారు. కాంగ్రెస్ లో చేరి పెద్దపల్లి టికెట్ ఆశించారు. కానీ అక్కడ కాకా ఫ్యామిలీ మంత్రాంగం ఫలించింది. వెంకట స్వామి మనవడు గడ్డం వంశీ కృష్ణకు కాంగ్రెస్ పెద్దపల్లి సీటిచ్చింది. దీంతో వెంకటేష్ నేత షాకయ్యారు, తనదారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యారు. నామినేషన్లు మొదలయ్యే టైమ్ కి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

బీజేపీలో టికెట్ ఇస్తారా..?

పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే మూడు పార్టీలు టికెట్లు ఖరారు చేశాయి. బీఆర్ఎస్ తరపున కొప్పుల ఈశ్వరి, కాంగ్రెస్ తరపున గడ్డం వంశీకృష్ణ, బీజేపీ తరపున గోమాస శ్రీనివాస్ తలపడాల్సి ఉంది. అయితే వెంకటేష్ నేత బీజేపీలో చేరితే గోమాస శ్రీనివాస్ కి ఇబ్బంది తప్పదని అంటున్నారు. ఆయన్ను బుజ్జగించి ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ కి అప్పగించేందుకు కూడా బీజేపీ సుముఖంగా ఉందట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్తున్న వెంకటేష్ నేత.. పెద్దపల్లిలో ఎంతవరకు తన పట్టు నిలుపుకుంటారో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News