ప్రాణం పోయినా పార్టీని విలీనం చేయను..

తన గెలుపు ప్రజల చేతుల్లోనే ఉందని, గెలిచినా గెలవకపోయిన ప్రజలకు అండగా ఉండి పోరాడతానన్నారు పవన్.

Advertisement
Update: 2022-07-17 02:51 GMT

కచ్చితంగా అధికారంలోకి వస్తాం, 2024లో జనసేన జెండా ఎగరేస్తామని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ అదే సమయంలో పార్టీ విలీనం అనే అంశంపై కూడా పదే పదే క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. టీడీపీకి తోకపార్టీగా, పొత్తులు లేకుండా పోటీ చేయలేని పార్టీగా జనసేనపై ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుంటారు. చంద్రబాబు దత్తపుత్రుడంటూ పవన్ ని ఎద్దేవా చేస్తుంటారు. ఆ ఇమేజ్ ని చెరిపేసేందుకు పవన్ పదే పదే తాపత్రయ పడుతున్నారు. తాజాగా మండపేటలో కౌలురైతు భరోసా యాత్ర చేపట్టిన పవన్ కల్యాణ్ తన కంఠంలో ప్రాణం ఉండగా పార్టీని విలీనం చేసేది లేదన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన అభ్యర్థిలో తనను చూసి ఓటు వేయండని చెప్పారు.

కౌలు రైతు రాజకీయ యాత్ర..

వాస్తవానికి పవన్ కల్యాణ్ మండపేటలో కౌలు రైతు భరోసా పేరుతో యాత్ర చేసి అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. కానీ అది పూర్తిగా రాజకీయ సభగా మారింది. వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ గోదావరి జిల్లాలనుంచే మార్పు రావాలని, అది పులివెందులకు తాకాలని చెప్పారు పవన్ కల్యాణ్. అన్న వస్తాడు, మామ‌య్య వస్తాడని వైసీపీ నేతలు మాయమాటలు చెప్పారని, వైసీపీ నేతల్లాగా తనకు కోట్ల రూపాయల ఆస్తుల్లేవని, కానీ ప్రజల కష్టాలు తెలుసుకుని తీర్చడానికే తాను ప్రజల్లోకి వచ్చానని చెప్పారు పవన్. అంబేద్కర్ ను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని, ఆయనపై నిజంగా ప్రేమ ఉంటే అన్ని జిల్లాలతోపాటే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మొదట్లోనే ఎందుకు నామకరణం చేయలేదని ప్రశ్నించారు. జిల్లా పేరుని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూడటం వల్లే అమలాపురంలో అల్లర్లు జరిగాయన్నారు పవన్.

తమ పార్టీ నేతలు ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రజాస్వామ్యంలో అది సరికాదన్నారు పవన్ కల్యాణ్. ఎంతమందిపై కేసులు పెడతారో పెట్టుకోనీయండి, కానీ ప్రజలు, ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తూనే ఉండాలని చెప్పారు. రేపు తమ పార్టీ అధికారంలోకి వచ్చినా తప్పులుంటే ప్రశ్నించాలని సూచించారు. వైసీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి, నిలదీసినవారిపై కేసులు పెట్టడం ఎక్కడి సంస్కృతి అని ప్రశ్నించారు పవన్.

గెలిచినా ఓడినా మీతోనే..

తన గెలుపు ప్రజల చేతుల్లోనే ఉందని, గెలిచినా గెలవకపోయిన ప్రజలకు అండగా ఉండి పోరాడతానన్నారు పవన్. జనసేన అధికారంలోకి వస్తే పంచాయతీలకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల ఉపాధి కోసం 10 లక్షల రూపాయల వంతున రుణాలు ఇస్తామన్నారు. త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్న పవన్.. 2024 ఎన్నికల్లో జనసేన గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News