కేసీఆర్ కేబినెట్ లోకి పట్నం.. మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం

పట్నం మహేందర్ రెడ్డి మంత్రి పదవి విషయంలో అధికారిక ప్రకటన వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

Advertisement
Update: 2023-08-24 01:34 GMT

కేసీఆర్ కేబినెట్ విస్తరణ అనేది అధికారిక ప్రకటనగా మారింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేస్తారు. కేసీఆర్ కేబినెట్ లో కొలువుదీరతారు. అయితే ఆయనకు ఏ శాఖ ఇస్తారనే విషయం మాత్రం బయటకు రాలేదు. ఈటల రాజేందర్ పై వేటు తర్వాత ఖాళీ అయిన వైద్య, ఆరోగ్య శాఖను ఇస్తారా, లేక మరో శాఖను కేటాయిస్తారా అనేది చూడాలి. ఎన్నికల వరకు అంటే దాదాపు 3 నెలలపాటు పట్నం మంత్రి పదవిలో ఉంటారు.

చేవెళ్ల ఎంపీ ట్వీట్..

బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన రోజే కేసీఆర్ కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపించాయి. కేబినెట్ లోకి ఇద్దర్ని తీసుకుంటారనే వార్తలొచ్చాయి. పట్నం మహేందర్ రెడ్డితోపాటు, కామారెడ్డిలో కేసీఆర్ కోసం సీటు త్యాగం చేసిన గంప గోవర్దన్ కి కూడా మంత్రి పదవి దక్కుతుందని అంచనా వేశారు. కానీ పట్నం మహేందర్ రెడ్డి విషయంలోనే అధికారిక ప్రకటన వచ్చింది. పట్నంకు మంత్రి పదవి దక్కిందని, ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుందని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి చేసిన ట్వీట్ తో.. ఈ వ్యవహారం అధికారికం అయింది.


చేవెళ్ల ఎంపీనే ఎందుకు..?

మంత్రి పదవి విషయంలో పట్నం మహేందర్ రెడ్డి ఎంత సంతోషంగా ఉన్నారో తెలియదు కానీ, ఆయనకంటే ఎక్కువగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సంబర పడుతున్నారు. ఈ మంత్రి పదవితో ఆయనకున్న ఓ దిగులు తీరిపోయింది. చేవెళ్ల లోక్ సభ పరిధిలోకి వచ్చే తాండూరు అసెంబ్లీ నియోజకవర్గ సమస్యకు పరిష్కారం లభించినట్టయింది. తాండూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ తెలిసిందే. వచ్చే దఫా అక్కడ పైలట్ రోహిత్ రెడ్డికే సీఎం కేసీఆర్ సీటు ఖాయం చేశారు. దీంతో పట్నం వర్గం ఉడుక్కుంది. కానీ పట్నంను మంత్రి పదవితో కాస్త కూల్ చేశారు కేసీఆర్. ప్రస్తుతం పట్నం, పైలట్ వర్గాల మధ్య సయోధ్య కుదిరింది. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి కూడా రిలాక్స్ అయ్యారు. అందుకే ఆయన ట్విట్టర్ ఖాతానుంచి ఈ విషయం బయటపెట్టారు. పట్నంకు శుభాకాంక్షలు తెలిపారు.  

Tags:    
Advertisement

Similar News