30 ఏళ్ల లీజుకు ఓఆర్ఆర్.. హెచ్ఎండీఏకు రూ.7,380 కోట్ల ఆదాయం

సాంకేతిక, ఆర్థిక, బిడ్లను పరిశీలించిన తర్వాత ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా ఎల్1గా నిలిచింది. ఈ సంస్థ వేసిన బిడ్ అమౌంట్ రూ.7,380 కోట్లను ఒకే సారి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement
Update: 2023-04-28 01:57 GMT

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హెచ్ఎండీఏ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. హైదరాబాద్ నగరానికే గర్వకారణంగా నిలిచిన ఓఆర్ఆర్‌ను 30 ఏళ్ల పాటు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా అనే సంస్థకు లీజుకు ఇచ్చింది. దీని ద్వారా హెచ్ఎండీఏకు రూ.7,380 కోట్ల ఆదాయం సమకూరనున్నది. ఓఆర్ఆర్ లీజుకు ఇవ్వడానికి పిలిచిన టెండర్లలో మొదట నాలుగు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. అయితే సాంకేతిక, ఆర్థిక, బిడ్లను పరిశీలించిన తర్వాత ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా ఎల్1గా నిలిచింది. ఈ సంస్థ వేసిన బిడ్ అమౌంట్ రూ.7,380 కోట్లను ఒకే సారి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ కారణంగా నగరంలో రద్దీ చాలా వరకు తగ్గిపోయింది. అయితే దీని నిర్వహణను హెచ్ఎండీఏకు చెందిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) చూస్తోంది. రహదారుల నిర్వహణ, మరమ్మతులు, భద్రత, విద్యుత్ లైట్లు, ఇంటర్ ఛేంజ్‌ల రక్షణ మొత్తం హెచ్‌జీసీఎల్ మేనేజ్ చేస్తోంది. అయితే నిధులు, మానవ వనరుల కొరత కారణంగా నిర్వహణ భారంగా మారింది. అందుకే ప్రైవేటు సంస్థకు నిర్వహణను అప్పగించారు. టోల్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (టీవోటీ) పద్దతిలో ఇప్పుడు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా ఓఆర్ఆర్‌ను 30 ఏళ్ల పాటు నిర్వహించనున్నది. దీంతో హెచ్‌జీసీఎల్‌కు ఓఆర్ఆర్ నిర్వహణ భారం తప్పినట్లైంది.

ప్రైవేట్ రంగ భాగస్వామ్యం అవసరం : మంత్రి కేటీఆర్

ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఓఆర్ఆర్ లీజు విషయంలో ఆయన ఒక ప్రకటన చేశారు. ప్రైవేటు రంగ భాగస్వామ్యం అవసరమని చెప్పారు. పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు తెలంగాణ అత్యంత అనుకూలమైన రాష్ట్రమని చెప్పారు. ఇక్కడ లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలు, మౌలిక వసతులు, వాతావరణం, సానుకూల ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం వల్ల అనేక సంస్థలు ఇక్కడకు వస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక, ఇతర రంగాల్లో రాష్ట్రం దూసుకొని పోతోందని కేటీఆర్ వెల్లడించారు.

పెట్టుబడులకు తెలంగాణ ఎంతో అనుకూలం అనే విషయం ఓఆర్ఆర్ లీజు ద్వారా మరోసారి వెల్లడైందని సీఎం కేసీఆర్ అన్నారు. పెట్టుబడులకు ఇది మరింత ప్రోత్సాహం ఇస్తుంది. మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చేందుకు ఇది నమ్మకాన్ని కలిగిస్తుంది. పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ తలుపులు తీసే ఉంచుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పాటు లభిస్తుందని అన్నారు.

Tags:    
Advertisement

Similar News