పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థికి షాక్‌ తప్పదా..!

యశస్విని ఎక్కువకాలం విదేశాల్లోనే ఉన్నారని, గత 5 ఏళ్లలో కేవలం ఐదున్నర నెలలుగా మాత్రమే ఇక్కడ ఉంటున్నారని కోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాదులు వివ‌రించారు.

Advertisement
Update: 2023-11-11 02:28 GMT

పాలకుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డి పోటీపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. యశస్విని రెడ్డి పేరును నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా నుంచి తొలగించకపోవడాన్ని సవాల్ చేస్తూ నాగర్‌కర్నూల్‌కు చెందిన కె.దేవ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ యశస్విని ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో నివాసం ఉంటున్నారని.. ఇదే చిరునామా పాస్‌పోర్టులో కూడా ఉందన్నారు. తగిన తనిఖీలు నిర్వహించి స్థానికంగా నివాసం లేని పేర్లను తొలగించాల్సి ఉండగా.. అలా జరగలేదని వాదించారు. యశస్విని 2018 నుంచి వంగనూరు మండలం దిండి చింతపల్లి గ్రామంలో ఓటరుగా ఉన్నారని.. ఇది తెలిసిన జిల్లా ఎన్నికల అధికారి నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఉన్న ఓటును తొలగించాల్సి ఉందన్నారు.

ఇక యశస్విని ఎక్కువకాలం విదేశాల్లోనే ఉన్నారని, గత 5 ఏళ్లలో కేవలం ఐదున్నర నెలలుగా మాత్రమే ఇక్కడ ఉంటున్నారని కోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాదులు వివ‌రించారు. వాదనలు విన్న బెంచ్‌.. డ్రాఫ్ట్‌, సవరణ, తుది ఓటరు జాబితాలను విడుదల చేసిన వివరాలను సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

ఇక ఇప్పటికే అడ్వకేట్‌ రాజేశ్‌ కుమార్‌, సామాజిక కార్యకర్త శివకుమార్‌ యశస్విని రెడ్డి పోటీపై అభ్యంతరం తెలిపారు. యశస్విని రెడ్డి పోటీ నిబంధనలకు విరుద్ధమని నోటీసులు ఇచ్చారు. ఏడాదిలో 183 రోజులు దేశంలో నివసించలేదని లేఖలో పేర్కొన్నారు. కనీసం 180 రోజులు దేశంలో నివసించకపోతే ఓటు హక్కు కోల్పోతారని పేర్కొన్నారు. మొదట పాలకుర్తిలో యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆమె పౌరసత్వం విషయంలో ఇబ్బందులు ఎదురుకావడంతో కోడలు యశస్విని రెడ్డి బరిలో దిగింది. ఇప్పుడు యశస్విని రెడ్డి పోటీపైనా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News