CEIR అమలులో తెలంగాణకు మొదటి స్థానం

ఇలాంటి అప్పగింతల్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ముందువరుసలో ఉంటామని మరోసారి నిరూపించారు.

Advertisement
Update: 2023-06-30 01:23 GMT

సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (CEIR) విధానంతో పోయిన సెల్ ఫోన్లను గుర్తించి యజమానులకు అప్పగించడంలో తెలంగాణ, దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కేవలం రెండు నెలల కాలంలోనే 2288 ఫోన్లను తెలంగాణ పోలీసులు వాటి యజమానులకు అప్పగించారు. ఇతర రాష్ట్రాల్లో రికవరీలు బాగా తక్కువగా ఉన్నాయి. పోయిన సెల్ ఫోన్లను గుర్తించడం, వాటిని బ్లాక్ చేయడం, ట్రేస్ చేసి యజమానులకు తిరిగి అప్పగించడంలో తెలంగాణ పోలీస్ చూపిన చొరవను ఉన్నతాధికారులు ప్రశంసించారు. CEIR అమలులో మొదటి స్థానం సాధించినందుకు అభినందించారు.

మొబైల్‌ ఫోన్ల దొంగతనాలను అరికట్టేందుకు, పోయిన ఫోన్లను వెదికిపట్టుకునేందుకు టెలికం శాఖ సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (CEIR) విధానం అమలులోకి తెచ్చింది. ఇటీవల చాలా రాష్ట్రాల్లో పోలీసులు సెల్ ఫోన్ మేళాలు పెట్టి యజమానులకు పోయిన ఫోన్లను తిరిగి అప్పగిస్తున్నారు. అయితే ఇలాంటి అప్పగింతల్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో ముందువరుసలో ఉంటామని మరోసారి నిరూపించారు.

ఏప్రిల్ 19నుంచి CEIR విధానం తెలంగాణలో అమలులోకి వచ్చింది. జూన్ 19 వరకు మొత్తం 34,200 ఫోన్లను బ్లాక్‌ చేశారు పోలీసులు. వాటిలో 5,970 ఫోన్లను ట్రేస్‌ చేశారు. వాటిలో 2,288 ఫోన్లను వెదికి పట్టుకుని దొంగలనుంచి రికవరీ చేసి అసలు యజమానులకు అప్పగించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ విధానం ఎప్పటినుంచో అమలులో ఉన్నా రికవరీలు మాత్రం చాలా తక్కువ. ఢిల్లీలో దాదాపు 3.5 లక్షల ఫోన్లు మిస్ అయ్యాయి. వాటిలో పోలీసులు రికవరీ చేసింది కేవలం 1270. కర్నాటకలో రికవరీలు ఎక్కువగానే ఉన్నా.. ఐదు నెలల వ్యవధిలో కర్నాటక పోలీసులు చేసిన రికవరీకంటే.. తెలంగాణ పోలీసులే ఎక్కువ సగటు సాధించారు. పొరుగు రాష్ట్రం ఏపీలో పోలీసులు కేవలం 204 ఫోన్లు మాత్రమే ట్రేస్ చేయగలిగారు. బీహార్, హర్యానా, పశ్చిమబెంగాల్ లో ఈ కార్యక్రమం మరీ నీరసంగా సాగుతోంది.

Tags:    
Advertisement

Similar News