వారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు..

అమరుల స్థూపం దగ్గర జరిగిన నిరసన ప్రదర్శనను కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ని మరోసారి కార్నర్ చేశారు.

Advertisement
Update: 2023-11-17 14:17 GMT

కాంగ్రెస్ ని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని అన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ చేసిన ఘోరాలను ఎప్పటికీ మరచిపోలేమన్నారు. కాంగ్రెస్ చేతులకున్న రక్తపు మరకలు చెరిగిపోవని, ఆ పాపం వారిని వెంటాడుతూనే ఉంటుందన్నారు. గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం దగ్గర ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు చేస్తున్న నిరసన ప్రదర్శన వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ నేత చిదంబరం ఒప్పుకున్నట్టుగా.. వందలాదిమంది తెలంగాణ యువకులను కాంగ్రెస్ చంపేసిందని చెప్పారు కేటీఆర్.


తెలంగాణ ఏర్పాటుపై గతంలో కాంగ్రెస్ ప్రకటన చేసినట్టే చేసి వెనక్కు తగ్గడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సంగతి తెలిసిందే. వందలాదిమంది ఉద్యమకారులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ ఆమరణ దీక్షకు జడిసి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకి అంగీకరించింది. ఆ సందర్భంలో ఉద్యమకారుల బలిదానాలకు కారణంగా నిలిచిన కాంగ్రెస్ క్షమాపణ చెబుతున్నట్టు ఇటీవల చిదంబరం హైదరాబాద్ లో స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. చిదంబరం వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఇరుకునపడినట్టయింది.

చిదంబరం వ్యాఖ్యల్ని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇన్నాళ్లకు కాంగ్రెస్ తన తప్పు ఒప్పుకున్నా ఆ పాపం కడిగేసుకోవాలనుకోవడం కుదరదన్నారు. ఎన్నికల వేళ ఇది కాంగ్రెస్ కొత్త ఎత్తుగడగా అభివర్ణించారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టడం విశేషం. అమరుల స్థూపం దగ్గర జరిగిన నిరసన ప్రదర్శనను కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ని మరోసారి కార్నర్ చేశారు. 

Tags:    
Advertisement

Similar News