మెట్రో రైళ్లకు అదనపు కోచ్ లు.. లాస్ట్ మైల్ కనెక్టివిటీపై దృష్టి

మెట్రో విస్తరణలో భాగంగా కొత్త మార్గాల్లో అవసరమైన సర్వే వెంటనే చేపట్టాలని, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకోసం భారీగా మెట్రో విస్తరణ అవసరం అని చెప్పారు.

Advertisement
Update: 2023-08-10 13:16 GMT

ప్రస్తుతం మెట్రో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారిడార్లలో అదనపు కోచ్ లను పెంచాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీపై దృష్టి సారించి మరిన్ని ఫీడర్ సర్వీస్‌ లను ప్రారంభిస్తే మెట్రో సామర్థ్యం రెట్టింపు అవుతుందన్నారు. మరింతగా మెట్రో వ్యవస్థ ప్రజలకు చేరువవుతుందని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం అయితే హైదరాబాద్ నగరానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్, ఎయిర్‌ పోర్టు మెట్రో వ్యవస్థపై మెట్రో రైల్ భవన్‌ లో అధికారులతో మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.


మెట్రో రైలును భారీగా విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా పనులు చేపట్టాలని సమీక్షలో అధికారుల్ని ఆదేశించారు మంత్రి కేటీఆర్. ఎయిర్‌ పోర్టు మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ వేపై ప్రత్యేకంగా చర్చించారు. దీని కోసం 48 ఎకరాల భూమి అవసరం అని గుర్తించగా, దాన్ని మెట్రో డిపో కోసం అప్పగించాలని జీఎంఆర్‌ అధికారులను మంత్రి ఆదేశించారు.

సర్వేలు, డీపీఆర్ లు..

మెట్రో విస్తరణలో భాగంగా కొత్త మార్గాల్లో అవసరమైన సర్వే వెంటనే చేపట్టాలని, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకోసం భారీగా మెట్రో విస్తరణ అవసరం అని చెప్పారు. నగరంలో వాహనాల రద్దీ, కాలుష్యం తగ్గేలా మెట్రో విస్తరణ చేస్తామన్నారు. మెట్రో విస్తరణ కోసం అవసరమైన నిధుల సేకరణకు ఉన్న అవకాశాలను వేగంగా పరిశీలించాలని ఈ సందర్భంగా ఆర్థిక, పురపాలక శాఖ అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. మెట్రో స్టేషన్లతో పాటు కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌ ల నిర్మాణం కోసం ప్రభుత్వ అధీనంలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు మంత్రి కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News