కులం, మతం.. వెనకబాటుతనం..

దేశంలో ప్రస్తుతం మతం మత్తు మందులా తయారైందని అన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణ సమాజం జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.

Advertisement
Update: 2022-07-13 15:15 GMT

దేశంలో ప్రస్తుతం మతం మత్తు మందులా తయారైందని అన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణ సమాజం జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. హిట్లర్ కాలంలో నాజీలు మనకోసం వచ్చేవరకు కూడా మనం మేల్కోలేని పరిస్థితి వస్తుందని జర్మన్ కవి చేసిన హెచ్చరికల్ని ఉదాహరణగా చెప్పారు కేటీఆర్.

మతం రాజకీయ పార్టీ ముసుగు వేసుకొని వస్తే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు పుడుతుంటారని, ప్రస్తుతం కేసీఆర్ అలాగే ప్రశ్నించే గొంతుగా మారారని చెప్పారు. రాజకీయ పార్టీ ముసుగు వేసుకున్న మతం, దేశాన్ని గందరగోళ పరుస్తుందని అన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆ గందరగోళానికి ఎదురు తిరిగారని, దేశమంతా ఆయన స్ఫూర్తితో ప్రశ్నించే గొంతులు పెరుగుతున్నాయని చెప్పారు. "చరిత్రపుటల్లో తెలంగాణ" గ్రంథాన్నిఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గ్రోత్ క్యారిడార్ కేంద్ర కార్యాలయంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ మాదాడి వెంకటేశ్వరరావు ఈ పుస్తకాన్ని రూపొందించారు.

కులమత సంకెళ్లలో చిక్కుకున్న దేశం పురోగమించలేదని చెప్పారు కేటీఆర్. యువతరం సెక్యులర్ భావాలతో ఎదిగితేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ దూసుకుపోవాల్సిన సమయంలో కుల, మతాల ఉచ్చులో పడిపోకూడదని చెప్పారు. ప్రపంచ చరిత్రను అధ్యయనం చేస్తున్న విద్యార్థులు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. దేశంలో మానవత్వంపై దాడి జరుగుతున్నప్పుడు ఆలోచనపరులైన యువతరం స్పందించాలన్నారు. యువతరం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం వున్నదని, లేకపోతే కులం, మతం పేరుతో కొట్లాడుకునే విష వలయాలలో చిక్కుకుంటారని హెచ్చరించారు. "చరిత్రపుటల్లో తెలంగాణ" పుస్తకం చదివితే తెలంగాణ చరిత్రపై సమగ్ర అవగాహన వస్తుందని, ముఖ్యంగా యువతరం ఆ చరిత్ర తెలుసుకోవాలని కోరారు కేటీఆర్.

తెలంగాణ చరిత్ర, తెలంగాణ పోరాటం, తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం, జాతరలు పండగలు.. ఇంకా చాలా అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సమగ్ర కథనాల సమాహారంగా ఈ పుస్తకాన్ని రూపొందించిన రచయితలను మంత్రి కేటీఆర్ అభినందించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్, రచయితలతోపాటు.. తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News