బండి పాత్రలో అమిత్ షా పరకాయ ప్రవేశం.. టీఆర్ఎస్ కౌంటర్లు..

అబద్ధాలు, అర్థంలేని మాటలు, అసందర్భ ప్రేలాపనలు.. ఇవి తప్ప అమిత్ షా సభలో ఇంకేమైనా ప్రస్తావించారా అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి.

Advertisement
Update: 2022-08-22 02:17 GMT

అమిత్ షా సభపై టీఆర్ఎస్ కౌంటర్లు మామూలుగా లేవు. ఓ రేంజ్ లో ఆయన్ని ఆటాడేసుకుంటున్నారు గులాబి నేతలు. షా సభ అయిపోగానే మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్లు ఇచ్చారు. సహజంగా ప్రతి సభలో బండి సంజయ్ పసలేని ఆరోపణలు చేస్తుంటారని, ఈసారి ఆయన పాత్రను అమిత్ షా పోషించారంటూ ఎద్దేవా చేశారు. అబద్ధాలు, అర్థంలేని మాటలు, అసందర్భ ప్రేలాపనలు.. ఇవి తప్ప అమిత్ షా సభలో ఇంకేమైనా ప్రస్తావించారా అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి.

కేసీఆర్ పై అక్కసు..

పొలాల్లో రైతుల బోర్లకు మీటర్లు బిగించే విషయంపై క్లారిటీ ఇస్తారనుకుంటే తుస్సుమనిపించారు అమిత్ షా. మునుగోడు రైతాంగాన్ని ఆకట్టుకోడానికయినా కనీసం ఆ విషయంపై స్పందించలేదు. దీంతో బీజేపీ శ్రేణులు కూడా నీరసపడ్డాయని, అమిత్ షా సభతో, మునుగోడులో బీజేపీ పరాజయం ఖాయమైందని, ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డి కూడా దిగులుపడుతున్నారని సెటైర్లు వేశారు మంత్రి జగదీష్ రెడ్డి. కేవలం కేసీఆర్‌ పై అక్కసు వెళ్లగక్కేందుకే అమిత్ షా తెలంగాణ వచ్చినట్టు ఉందన్నారు. బీజేపీ అధినాయకుడే కేసీఆర్ కు సమాధానం చెప్పే పరిస్థితి లేదని అన్నారు. ఉన్న విషయాన్ని ఒప్పుకునే ధైర్యం బీజేపీకి లేదన్నారు జగదీష్ రెడ్డి.

ఇంత దిగజారాలా..?

కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే నాయకుడు, మరీ ఇంత దిగజారి మాట్లాడాలా అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. ఆయన స్థాయికి తగ్గట్లు మాట్లాడలేదన్నారు. ఫక్తు రాజకీయాలు, ఓట్లు-సీట్లు, అధికారం తప్ప.. వాళ్లకు ఇంకో యావ లేదన్నారు. అమిత్ షా సభతో, సభలో ఆయన మాటలతో రాష్ట్రానికి, మునుగోడు ప్రజలకు ఒరిగిందేమీ లేదని చురకలంటించారు. మునుగోడులో బీజేపీకి డిపాజిట్ దక్కదని అమిత్ షా, మోదీ.. ఇలా ఎంతమంది ప్రచారానికి వచ్చినా బీజేపీకి ఒక్క ఓటు కూడా పెరగదని చెప్పారు. ఏ ఉప ఎన్నికతో తెలంగాణలో తమ పరపతి పెరుగుతుందని బీజేపీ ఆశిస్తోందో.. అదే ఉపఎన్నికతో తెలంగాణలో బీజేపీ పతనం ఖాయమైందనే విషయం రుజువవుతుందని చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News