ఇవి అచ్చేదిన్ కాదు.. సామాన్యుడు సచ్చేదిన్ : మందుల ధరల పెంపుపై హరీశ్ రావు ఫైర్

ఆయా మందుల ధరలు పెంచితే కచ్చితంగా పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతుందని మంత్రి చెప్పారు. సామాన్యుడి ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వ పనిగా పెట్టుకుందని హరీశ్ రావు అన్నారు.

Advertisement
Update: 2023-03-30 14:18 GMT

మందుల ధరలను 12 శాతం మేర పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు పెంచడం వల్ల.. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్యే అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ట్వీట్ చేశారు. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా కోసం వినియోగించే మందులతో పాటు.. పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్ వంటి నిత్యం వాడే 800పైగా రకాల మెడిసిన్స్ ధరలు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నది.

ఆయా మందుల ధరలు పెంచితే కచ్చితంగా పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతుందని మంత్రి చెప్పారు. సామాన్యుడి ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వ పనిగా పెట్టుకుందని హరీశ్ రావు అన్నారు. ఇప్పటికే అవకాశం దొరికినప్పుడల్లా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోంది. తాజాగా జబ్బు చేస్తే కాపాడే మందుల ధరలకు పెంచేందుకు కూడా కేంద్రం సిద్ధపడిందని అన్నారు.

ఇది అత్యంత బాధాకరం.. కేంద్రానికి దుర్మార్గమైన చర్యగా హరీశ్ రావు అభివర్ణించారు. ఇదేనా బీజేపీ చెబుతున్న అమృత్ కాల్ అని ప్రశ్నించారు. ఇవి అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చేదిన్ అని పేర్కొన్నారు. దేశంలో బీజేపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని హరీశ్ రావు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ పెంచని రీతిగా భారీగా 12 శాతం మేర ఔషధాల ధరలు పెంచింది. శనివారం నుంచి ఈ మేరకు కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. బీజేపీ పాలనలో ధరలు అన్నీ పెరగడమే తప్ప.. తగ్గే పరిస్థితి లేదని విమర్శిస్తున్నాయి.


Tags:    
Advertisement

Similar News