బండి సంజయ్, ప్రమాణానికి సిద్ధమా..? గంగుల సవాల్

కరీంనగర్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేయలేదని భాగ్యలక్ష్మి టెంపుల్‌ లో బండి సంజయ్ ప్రమాణం చేస్తాడా అంటూ సవాల్‌ విసిరారు మంత్రి గంగుల. ఎంపీ హోదాలో ఉండి కూడా గూండాలను తీసుకుపోయి దాడులు చేస్తున్నాడని ఆరోపించారు.

Advertisement
Update: 2023-11-29 10:04 GMT

కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి వర్సెస్ ఎంపీ పోరు రసవత్తరంగా మారింది. బండి సంజయ్, గంగుల కమలాకర్.. ఎవరికి వారు తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. బండి సంజయ్ ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు మంత్రి గంగుల. బండి సంజయ్ సీసీ టీవీ ఫుటేజ్‌ ను గంగుల విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి బీజేపీవాళ్లు డబ్బులు, మద్యం పంపిణీ చేశారన్నారు. కొత్తపల్లిలో బండి డబ్బులు పంచుతుంటే తమ పార్టీ నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని, చివరకు బండి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు సభ్యుడి స్థాయిలో హుందాగా ఉండాల్సినవారు అలా చేయడం ఏంటని ప్రశ్నించారు గంగుల.

కరీంనగర్‌ లో బండి సంజయ్ అకృత్యాలతో ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు గంగుల. డబుల్ ఇంజిన్ సర్కార్ అని బండి సంజయ్‌ని ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌కి నిరాశే మిగిలిందన్నారు. కరీంనగర్ లో వెంకటేశ్వర స్వామి గుడి, ఇస్కాన్ టెంపుల్ కడుతుంటే.. బండి సంజయ్ ఒక్క పైసా కూడా చందా ఇవ్వలేదని విమర్శించారు గంగుల. ధర్మం కోసం అంటూ దేవుడి పేరు చెప్పే బండి సంజయ్ ఒక్క గుడికి పైసా ఇవ్వలేదన్నారు.

ప్రమాణం చేస్తావా..?

కరీంనగర్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ చేయలేదని భాగ్యలక్ష్మి టెంపుల్‌ లో బండి సంజయ్ ప్రమాణం చేస్తాడా అంటూ సవాల్‌ విసిరారు మంత్రి గంగుల. ఎంపీ హోదాలో ఉండి కూడా గూండాలను తీసుకుపోయి దాడులు చేస్తున్నాడని ఆరోపించారు. ఇంట్లో ఉన్న కార్యకర్తను కొట్టి బూతులు తిట్టారన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పని చేయడమంటే ఇదేనా అని నిలదీశారు. కరీంనగర్ లో తాము లక్ష సెల్ ఫోన్లు పంచి పెట్టామని బండి అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ సెల్ ఫోన్లు ఎవరికిచ్చాము, ఎక్కడున్నాయి అని ప్రశ్నించారు గంగుల. 


Tags:    
Advertisement

Similar News