పాత బస్తీ అభివృద్దిపై కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్‌లోని పాతబస్తీ అభివృద్ధిపై మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, వారసత్వ కట్టడాల పరిరక్షణలో జరుగుతున్న పనులు, సాధించిన ప్రగతిని తెలిపారు.

Advertisement
Update: 2023-02-07 16:53 GMT

పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీ అభివృద్ధిపై మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, వారసత్వ కట్టడాల పరిరక్షణలో జరుగుతున్న పనులు, సాధించిన ప్రగతిని తెలిపారు.

ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, ఏఐఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ, ఎంపీ డాక్టర్‌ జీ రంజిత్‌ రెడ్డి, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎస్‌ఆర్‌డిపిలో భాగంగా పాతబస్తీ ప్రాంతంలో రోడ్ నెట్‌వర్క్‌ను పటిష్టపరిచే పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పలు ఫ్లైఓవర్లు, రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే పాతబస్తీలో రోడ్ల విస్తరణ సవాలుగా ఉందని, రోడ్డు విస్తరణ అవసరమున్న ప్రాంతాల్లో పనులు వేగవంతం చేయాలని కేటీఆర్ అధికారులను కోరారు.

ట్రాఫిక్ జంక్షన్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, మూసీపై వంతెనల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని, తాగునీటి సౌకర్యాల అభివృద్ధికి రూ.1200 కోట్లకు పైగా ఖర్చు చేశామని, ఉచిత మంచినీటి పథకం కింద పాతబస్తీలో లక్ష కనెక్షన్లు తీసుకున్నారని, పాతబస్తీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా వ్యవస్థ బాగా మెరుగుపడిందని మంత్రి తెలిపారు. .

చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు, సాలార్‌జంగ్ మ్యూజియం సహా పర్యాటక ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ ఆరోగ్య పథకాలతో పాటు, ఈ ప్రాంతంలో 84 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. మీర్ ఆలం మండి పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మీర్ ఆలం ట్యాంక్‌పై ఆరు లైన్ల కేబుల్ వంతెన ప్రతిపాదనలు డీపీఆర్ దశలో ఉన్నాయి.

కాగా, పాతబస్తీ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, కేటీఆర్ ను ప్రత్యేకంగా అభినందించి, పాతబస్తీలో అవసరమైన కొన్ని కార్యక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన అమలు చేసేందుకు అన్ని రకాల సహాయ, సహకారాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తామని అక్బరుద్దీన్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News