రాజ్ గోపాల్ రెడ్డి అహంకారం : 'నేను చెప్పింది ఇనాలె... ఇస్తే తీసుకొని సప్పుడు చేయకుండా కూసోవాలే....'

మునుగోడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలపై విరుచుకపడ్డారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక 'నేను చెప్పింది ఇనాలె... నాకు ఎదురు చెప్పొద్దు...ఇస్తే తీసుకొని సప్పుడు చేయకుండా కూసోవాలే....' అని బెదిరించాడు.

Advertisement
Update: 2022-10-25 05:48 GMT

మునుగోడు ఎన్నికల ప్రచారం తీవ్రతరమైంది. ఆరోపణలు, ప్రత్యారోపణలే కాక , ప్రజల నిరసనలు, కొట్లాటలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరి, ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయనకు , ఆయన తరపున వెళ్ళిన ఇతర బీజేపీ నేతలకు చాలా చోట్ల ప్రజల నుండి నిరసనలు ఎదురవుతున్నాయి.

రాజగోపాల్ రెడ్డి, ఆయన భార్య...ఇద్దరినీ ఓ గ్రామంలో ప్రజలు ప్రచారం చేయకుండా తరిమి కొట్టారు. 18000 కోట్ల కాంట్రాక్ట్ కోసం కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరాడనే విషయం పల్లె పల్లెకూ ప్రచారమయ్యింది. సాధారణ ప్రజలు కూడా దీనిపై చర్చించుకుంటున్నారు. నిన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి కోసం పని చేసిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలే ఆయనకు ఎదురు తిరుగుతున్నారు.

ఈ పరిణామాలను కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి భరించలేకపోతున్నాడు. తనకు ఎదురే లేదనుకున్న మునుగోడు నియోజక వర్గంలో అనేక చోట్ల ప్రజలు తనను ఎదిరించడం ఆయనకు అసహనం కలగజేస్తోంది. దాంతో సభల్లో ఎవరైనా నిరసన తెలిపితే ఆయన అసహనంతో రెచ్చిపోతున్నాడు. ప్రజలపై విరుచుకపడుతున్నాడు.

మునుగోడు నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేస్తుండగా ప్రజలనుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో తట్టుకోలేకపోయిన రాజగోపాల్ రెడ్డి ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ''నేను ఏది చెబితే అది వినాలి, నాకు ఎదురు చెప్పొద్దు..ఇస్తే తీసుకొని సప్పుడు చేయకుండా కూసోవాలే....'' అని జనంపై విరుచుకపడ్డాడు.

దాంతో ఒక్కసారి షాక్ కు గురైన జనం రాజగోపాల్ రెడ్డిది డబ్బుల అహంకారమని మండిపడ్డారు. డబ్బుల కోసం పార్టీ మారిన ఆయన తమపైనే మండిపడటాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని జనం చర్చించుకుంటున్నారు.

మరో వైపు రాజగోపాల్ రెడ్డి ప్రజలపై విరుచుకపడి అహంకారంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజనులు రాజగోపాల్ రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్నారు.


Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC