టికెట్ కావాలా.. డబ్బు కట్టి దరఖాస్తు చేసుకోండి : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

టికెట్ కావాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందేనని.. చివరకు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత కూడా దరఖాస్తు చేసుకుంటేనే టికెట్ వస్తుందని స్పష్టం చేశారు.

Advertisement
Update: 2023-08-18 11:06 GMT

కాంగ్రెస్‌ పార్టీ తరపున రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డబ్బుల కట్టి ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. టికెట్ కావాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందేనని.. చివరకు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత కూడా దరఖాస్తు చేసుకుంటేనే టికెట్ వస్తుందని స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కోసం దరఖాస్తులను నేటి నుంచి ఈ నెల 25 వరకు స్వీకరించనున్నారు. ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీభవన్‌లో ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే ప్రతీ దరఖాస్తుకు నిర్ణీత రుసుమును కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు రుసుము రూ.25 వేలుగా నిర్ణయించారు. ఇక ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.50వేలు దరఖాస్తు రుసుముగా పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకున్న తర్వాత అర్హులైన వారిపై సర్వేలు చేయిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అలా పీసీసీ వడబోసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పంపుతామని.. అక్కడి నుంచి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా చేరుతుందని రేవంత్ చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిటీలో అభ్యర్థి ఎంపిక తేలకపోతే సీడబ్ల్యూసీకి పంపిస్తారని.. అక్కడే తుది నిర్ణయం వెలువడుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. నమూనా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చని చెప్పారు.

కాగా, దరఖాస్తు చేసుకున్న అందరికీ టికెట్లు వస్తాయనే గ్యారెంటీ లేదని.. ఒక వేళ ఎవరికైనా టికెట్ రాకపోతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని.. అలాగే రెబెల్‌గా నామినేషన్ వేయకూడదని కూడా దరఖాస్తులో నిబంధన విధించారు. 


Tags:    
Advertisement

Similar News