ఎట్టకేలకు స్మితా సబర్వాల్ దర్శనం

కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారంటూ వస్తున్న వార్తలను అంతకుముందు ట్విట్టర్ వేదికగా ఖండించారు. అవన్ని అవాస్తవమని తాను ఎక్కడికి వెళ్ళడం లేదని స్పష్టంచేశారు.

Advertisement
Update: 2023-12-14 11:46 GMT

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌.. అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. స్మితా సబర్వాల్‌ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ప్రచారానికి తెరదించారు స్మితా సబర్వాల్‌. తాజాగా తెలంగాణ పంచాయతీ రాజ్ మంత్రి సీతక్కను స్మితా సబర్వాల్ కలిశారు. సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో మంత్రిగా త‌న శాఖ‌కు సంబంధించిన బాధ్యతలను సీతక్క స్వీకరించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌కు వెళ్లిన స్మితా సబర్వాల్‌ సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారంటూ వస్తున్న వార్తలను అంతకుముందు ట్విట్టర్ వేదికగా ఖండించారు. అవన్ని అవాస్తవమని తాను ఎక్కడికి వెళ్ళడం లేదని స్పష్టంచేశారు. తాను రాష్ట్రంలోనే పనిచేస్తానని, ప్రభుత్వం తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా నిర్వహిస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో భాగమైనందుకు తాను గర్విస్తున్నట్లు చెప్పారు.


కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు స్మితా సబర్వాల్. ఆమె సామర్థ్యాన్ని గుర్తించిన కేసీఆర్‌.. సీఎం సెక్ర‌ట‌రీగా నియమించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కాళేశ్వరం పనులతోపాటు మిషన్ భగీరథ పనులనూ ఆమె పర్యవేక్షించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక స్మితా సబర్వాల్‌ ఎవరిని కలవలేదు. దీంతో ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది. మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి సైతం స్మితా సబర్వాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లి ఇక్కడి తప్పుల నుంచి తప్పించుకోవడం కొంత మంది ఐఏఎస్‌లకు ఫ్యాషన్ అయిందంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ వార్తలపై ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు స్మితా సబర్వాల్.

Tags:    
Advertisement

Similar News