ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరా"బాద్‌షా".. కేటీఆర్ ట్వీట్‌

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్‌ బేష్‌ అనిపించుకుంది. దేశంలో ఐటీకి గమ్యస్థానాలుగా ఉన్న హైదరాబాద్‌, బెంగళూరు ఉద్యోగాల కల్పనలో పురోగతి సాధించాయి.

Advertisement
Update: 2024-05-25 03:48 GMT

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ సెక్టార్‌లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఖర్చుల తగ్గింపులో భాగంగా పెద్ద సంస్థలు సైతం భారీగా ఉద్యోగులను తొలగించాయి. కొత్త ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ను సైతం తగ్గించాయి. ఈ ఎఫెక్ట్‌ ఇండియాలోనూ కనిపించింది. ప్లేస్‌మెంట్లు సైతం భారీగా తగ్గిపోయాయి. ఇండియాలోని ప్రతిష్టాత్మక ఐఐటీ నుంచి పట్టాలందుకున్న 30 శాతానికిపైగా స్టూడెంట్స్‌కు ఈ ఏడాది ప్లేస్‌మెంట్లు దొరకలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్‌ బేష్‌ అనిపించుకుంది. దేశంలో ఐటీకి గమ్యస్థానాలుగా ఉన్న హైదరాబాద్‌, బెంగళూరు ఉద్యోగాల కల్పనలో పురోగతి సాధించాయి. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఐటీ ఉద్యోగాలు, జాబ్ క్లిక్‌పై అధ్యయనం చేసిన ప్రముఖ జాబ్‌ పోర్టల్ ఇండీడ్‌ ఓ నివేదికను విడుదల చేసింది.


హైదరాబాద్‌ ఐటీ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ఇండీడ్ స్పష్టం చేసింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు భారీగా పెరిగాయి. గతేడాది దాదాపు ఈ పెరుగుదల హైదరాబాద్‌లో 41.5 శాతంగా ఉన్నట్లు ఇండీడ్‌ పేర్కొంది. ఇక బెంగళూరులో ఈ పెరుగుదల 24 శాతంగా ఉంది. ఐటీ ఉద్యోగాల కోసం వెతుకుతున్న యువత, నిపుణులు సైతం ఎక్కువగా హైదరాబాద్‌నే ఎంపిక చేసుకుంటున్నారని జాబ్‌క్లిక్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్, ట్రాఫిక్‌, కనీస మౌలిక సదుపాయాల కల్పనను పరిగణలోకి తీసుకుంటున్నారని నివేదిక తెలిపింది.

మరోవైపు దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల అవకాశాలు భారీగా తగ్గాయి. కొత్త ఉద్యోగాల్లో 3.6 శాతం తగ్గుదల నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారు నైపుణ్యాలు పెంచుకుంటేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలరని ఇండీడ్ నివేదిక సూచించింది. ఈ నివేదికపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గతేడాది ఐటీ ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్, బెంగళూరు టాప్‌ ప్లేసులో నిలిచాయంటూ ట్వీట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News