అక్కడ తండ్రీ కూతుళ్లు.. ఇక్కడ తల్లీ కొడుకులు.. హైదరాబాద్ లో ఒకేరోజు ఆరు ఆత్మహత్యలు

రెండు ఘటనలకు ఏమాత్రం సంబంధం లేదు కానీ.. ఒకేరోజు ఈ ఆత్మహత్యలు జరగడం మాత్రం హైదరాబాద్ లో కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఇలా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడటం చుట్టుపక్కలవారిని కలవరానికి గురి చేసింది.

Advertisement
Update: 2023-10-13 07:27 GMT

రెండు ఘటనలు.

ఆరు ఆత్మహత్యలు.

అక్క‌డ‌ ఒక తండ్రి, ఇద్దరు ఆడబిడ్డలు..

ఇక్కడ ఒక తల్లి, ఇద్దరు అబ్బాయిలు..

రెండు ఘటనలకు ఏమాత్రం సంబంధం లేదు కానీ.. ఒకే రోజు ఈ ఆత్మహత్యలు జరగడం మాత్రం హైదరాబాద్ లో కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఇలా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడటం చుట్టుపక్కలవారిని కలవరానికి గురి చేసింది.

సికింద్రాబాద్‌ బోయిన్‌ పల్లిలో ఓ తండ్రి, తన ఇద్దరు కూతుళ్లతో కలసి ఆత్మహత్య చేసుకున్నాడు. భవానీ నగర్ కాలనీకి చెందిన శ్రీకాంతా చారి వెండి నగలు తయారు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఆయనకు భార్య ఇద్దరు ఆడబిడ్డలు. ఏం జరిగిందో ఏమో.. ఈరోజు తెల్లవారిన తర్వాత తన భర్త, బిడ్డలు ఆత్మహత్య చేసుకుని చనిపోయారంటూ భార్య పోలీసులకు సమాచారమిచ్చింది. కుటుంబ కలహాలేవీ లేవని చెబుతున్నారు కానీ, ఆత్మహత్యలకు కారణం ఏమై ఉంటుందా అని పోలీసులు విచారణ చేపట్టారు. రాత్రి అంతా బాగానే ఉంటే, తెల్లవారే సరికి ముగ్గురు ఎందుకు చనిపోయారని భార్యను ప్రశ్నిస్తున్నారు. అందులోనూ అవి సైనైడ్ తో జరిగిన ఆత్మహత్యలు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

బోరబండ రాజ్ నగర్ కి చెందిన స్కూల్ టీచర్ జ్యోతిది మరో కథ. జ్యోతి స్కూల్ టీచర్ గా పనిచేస్తుండగా, ఆమె భర్త విజయ్ సెంట్రింగ్ కాంట్రాక్టర్. వీరికి అర్జున్, ఆదిత్య ఇద్దరు పిల్లలు. అర్జున్ వయసు నాలుగేళ్లు, ఆదిత్యకు రెండేళ్లు. తల్లి జ్యోతి, తన ఇద్దరు కొడుకులతో కలసి ఆత్మహత్య చేసుకుంది. పిల్లలకు విషమిచ్చిన తర్వాత, జ్యోతి ఉరేసుకుని చనిపోయింది. రెండేళ్లు, నాలుగేళ్ల వయసున్న చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటం అక్కడున్న స్థానికుల్ని కలచి వేసింది. హైదరాబాద్ లో ఒకేరోజు ఆరు ఆత్మహత్యలు జరగడం సంచలనంగా మారింది. 

Tags:    
Advertisement

Similar News