మెట్రో రెండో దశపై కాంగ్రెస్ ముద్ర.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..?

కొత్త ప్లాన్ ప్రకారం మెట్రోలో మరో 4 కారిడార్లు అదనంగా చేరుతాయి. వాటి పొడవు 70 కిలోమీటర్లు ఉంటుంది.

Advertisement
Update: 2024-01-23 02:01 GMT

మూడు కారిడార్లు, 69 కిలోమీటర్ల పొడవు.. ఇదీ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో స్వరూపం. దీన్ని మరింత విస్తృతం చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు రూపొందాయి. అయితే వీటిని పక్కనపెట్టి కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ మార్కుతో కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వాటిని ప్రభుత్వానికి సమర్పించారు. కొత్త ప్లాన్ ప్రకారం మెట్రోలో మరో 4 కారిడార్లు అదనంగా చేరుతాయి. వాటి పొడవు 70 కిలోమీటర్లు ఉంటుంది.

కొత్త కారిడార్లు ఇవే..

కారిడార్ 4: నాగోల్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఎల్బీ నగర్‌ మెట్రో స్టేషన్‌ వరకు, అక్కడినుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌ రోడ్డు, మైలార్‌దేవ్‌ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు (మొత్తం 29 కిలోమీటర్లు), మైలార్‌దేవ్‌ పల్లి నుంచి ఆరాంఘర్‌ మీదుగా రాజేంద్రనగర్‌ (4 కిలోమీటర్లు)

కారిడార్‌ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్‌ రామ్‌ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు (8 కిలోమీటర్లు)

కారిడార్‌ 6: మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ మీదుగా పటాన్‌చెరు వరకు (14 కిలోమీటర్లు)

కారిడార్‌ 7: ఎల్బీ నగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్‌ నగర్‌ వరకు (8 కిలోమీటర్లు)

కొత్త కారిడార్లతోపాటు ఇప్పటికే ఉన్న రెండో కారిడార్ విస్తరణ కూడా రెండో దశలో అంతర్భాగమై ఉంటుంది. సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు ఉన్న రెండో కారిడార్‌ను రెండో దశ విస్తరణ కింద చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు పొడిగిస్తారు. విస్తరణ, కొత్త కారిడార్లు కలుపుకుంటే రెండో దశ కింద మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేశారు.

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC