ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. - హైదరాబాద్‌లో ఘటన

భవనంలోని 9వ అంతస్తులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.

Advertisement
Update: 2023-12-24 03:25 GMT

హైదరాబాద్‌లోని అంకుర ఆస్పత్రిలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం అంతా మంటలు వ్యాపించడంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో చిన్నారులు, గర్భిణులు, వారి సహాయకులు, వైద్యులు, నర్సులు ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మంటలను చూసిన అంకుర ఆస్పత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆస్పత్రిలోని రోగులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇదే ఆస్పత్రి ఐదో అంతస్తులో నర్సుల హాస్టల్‌ కూడా ఉంది. అందులో పెద్ద సంఖ్యలో నర్సులు ఉన్నారు. ఊహించని విధంగా మంటలు చెలరేగడంతో అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హాస్టల్‌లోని నర్సులు దాదాపు 100 మంది మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమై బయటికి వచ్చేశారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 4 అగ్నిమాపక వాహనాల ద్వారా మంటలను ఆర్పివేశారు. గుడిమల్కాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అత్తాపూర్‌ వద్ద ఈ ఘటన జరిగింది. భవనంలోని 9వ అంతస్తులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. భవనంలోని పదో అంతస్తులో ప్లాస్టిక్‌ సామగ్రి ఎక్కువగా ఉండటంతో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయని తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని వివరించారు.

ఊహించని ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డామని, అయితే బయటికి వచ్చే క్రమంలో సర్టిఫికెట్లు మొత్తం హాస్టల్‌లోనే వదిలేసి వచ్చామని హాస్టల్‌లో ఉంటున్న నర్సులు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రమాదంతో అంకుర ఆస్ప‌త్రి పరిసరాల్లో దట్టమైన పొగ అలముకోవడంతో భీతావహ పరిస్థితి నెలకొంది.

Tags:    
Advertisement

Similar News