జిల్లాల పర్యటనకు కేసీఆర్.. ఎప్పుడంటే..

బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఊరుకునేది లేదని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు హరీష్‌రావు. ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల దగ్గరికి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

Advertisement
Update: 2024-01-06 09:49 GMT

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తారన్నారు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు. శనివారం తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే జనాల్లోకి రాబోతున్నారని చెప్పారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతిరోజూ కార్యకర్తలను కలుస్తారన్నారు హరీష్‌రావు.

కేసీఆర్‌ కిట్లపై కేసీఆర్ ఫొటోను తొలగించడంపై హరీష్‌రావు మండిపడ్డారు. ఫొటోను తొలగించారు కానీ, తెలంగాణ ప్రజల గుండెల నుంచి కేసీఆర్‌ను తొలగించలేరంటూ కౌంటరిచ్చారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ, వాయిదాలు వేస్తూ కొత్త ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు. ధాన్యం డబ్బులను, రైతు బంధు పథకం డబ్బులను ఇప్పటికీ వేయలేదన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు హరీష్‌ రావు.

బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఊరుకునేది లేదని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు హరీష్‌రావు. ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల దగ్గరికి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. పదేండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినా ప్రతిపక్షాల తప్పుడు ప్రచారంతో ఓడిపోయామన్నారు హరీష్‌రావు. మొన్నటి ఎన్నికలు కేవలం స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమే అన్నారు. తొలిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం, సత్తా ఏమిటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News