తెలంగాణలో పచ్చదనం 7.7 శాతం వృద్ధి చెందింది : మంత్రి హరీశ్ రావు

సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రవేశపెట్టిన హరిత హారం కారణంగానే పచ్చదనం భారీగా పెరిగింది.

Advertisement
Update: 2023-06-19 07:42 GMT

తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన హరితహారం కారణంగా రాష్ట్రంలో పచ్చదనం (గ్రీన్ కవర్) 7.7 శాతం మేర పెరిగిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అన్ని రకాలైన మౌలిక వసతులతో తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది. ప్రపంచంలో ఇలాంటి వసతులతో అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా తెలంగాణ హరితహారం కారణంగా జరిగిన లబ్దిని ఉటంకిస్తూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.

సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రవేశపెట్టిన హరిత హారం కారణంగానే పచ్చదనం భారీగా పెరిగింది. గతంలో ఏ పాలకుడు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. కేసీఆర్ వంటి నిజమైన పర్యావరణవేత్తే.. సమగ్ర, స్థిరమైన అభివృద్ధి గురించి ఆలోచిస్తారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ఆచరిస్తుంటే.. దేశం పాటిస్తున్నదనే నానుడి హరితహారం విషయంలో కూడా నిజమైందని చెప్పారు.

2015లో ప్రారంభించిన హరిత హారం కారణంగా రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 14,864 నర్సరీలు.. 19,472 పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13.44 లక్షల ఎకరాల్లో అడవులను పునరుద్దరించామని.. 273 కోట్ల మొక్కలను నాటామని మంత్రి చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో అడవులు, పచ్చదనం మరింతగా పెరుగుతాయని అన్నారు. హరితహారంలో ప్రతీ ఒక్కరు పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. 


Tags:    
Advertisement

Similar News