ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత

ప్రజా గాయకుడు గద్దర్ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గుండె సంబంధిత అనారోగ్యంతో ఆయన ఇటీవలే ఆస్పత్రిలో చేరారు.

Advertisement
Update: 2023-08-06 10:48 GMT

ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూశారు. ఇటీవల కొత్త పార్టీ పెట్టి రాజకీయంగా మళ్లీ చర్చల్లోకి వచ్చిన ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 74 ఏళ్లు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌ పేటలోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేరిన గద్దర్‌ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఆపరేషన్ చేశారు, ఆపరేషన్ విజయవంతమైందని ఆస్పత్రి వర్గాలు కూడా తెలిపాయి. పరామర్శించేందుకు సన్నిహితులు, రాజకీయ ప్రముఖులు ఆస్పత్రికి వచ్చారు. అయితే హఠాత్తుగా ఈరోజు ఆయన మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి.

ప్రజా గాయకుడిగా, ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్.. తెలుగువారికే కాదు తన పాటల ద్వారా దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. 1949లో తూప్రాన్‌లో జన్మించిన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావ్‌. నిజామాబాద్‌, హైదరాబాద్‌ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన 1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. భార్య విమల, ముగ్గురు పిల్లలున్నారు. విప్లవ భావాలున్న గద్దర్ తన పిల్లలకు సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అనే పేర్లు పెట్టుకున్నారు.

ఊరూరా పాటలతో ప్రజా చైతన్యం..

జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ కూడా ఒకరు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఊరూరా పాటలతో ప్రజల్ని ఉత్తేజ పరిచేవారు గద్దర్. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో తన పాటలతో కీలకంగా వ్యవహరించారు. నడుస్తున్న పొద్దుమీద.. అంటూ ఆయన రాసిన పాట తెలంగాణ ఉద్యంలో ప్రతి ఒక్కరి నోటా ప్రతిధ్వనించింది. వేదికపైనే ఆశువుగా పాటలు అల్లుతూ ప్రజల్ని ఉత్తేజ పరచడంలో ఆయన మేటి. 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌ పై హత్యాయత్నం కూడా జరిగింది. ఆ ఘటనలో ఓ బుల్లెట్ ఆయన శరీరంలోనే ఉండిపోయింది. దాన్ని తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం కాబట్టి, అలా దాన్ని అలా వదిలేశారు వైద్యులు. ‘మాభూమి’ సినిమాలో వెండితెరపై కనిపించిన గద్దర్‌, పలు సినిమాలకు పాటలు రాశారు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా.. వంటి పాటలు ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చాయి. ప్రజాగాయకుడిగా తన పాటతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు గద్దర్. ఈరోజు తుదిశ్వాస విడిచారు. 

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC