తెలంగాణ ఓటర్ల తుది జాబితా విడుదల

తెలంగాణలో 3,17,17,389 మంది ఓట్లర్లు ఉన్నట్లు తుది జాబితాలో ఈసీ పేర్కొన్నది.

Advertisement
Update: 2023-10-04 12:20 GMT

తెలంగాణ ఓటర్ల తుది జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం పూర్తయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకు అతి ముఖ్యమైన ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం విడుదల చేసింది. రెండు నెలలుగా ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. కొత్త ఓటర్ల నమోదుతో పాటు డూప్లికేట్, డబ్లింగ్ ఓట్లను తొలగించాలని నిర్ణయించింది. అంతే కాకుండా ఓటర్లు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి, వేరే నియోజకవర్గానికి బదిలీ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడంతో తాజాగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది.

తెలంగాణలో 3,17,17,389 మంది ఓట్లర్లు ఉన్నట్లు తుది జాబితాలో ఈసీ పేర్కొన్నది. గత జనవరి కంటే 5 శాతం మంది ఓటర్లు పెరిగినట్లు ఈసీ చెప్పింది. కొత్త ఓటర్లు, తొలగించిన ఓట్ల లెక్కింపు తర్వాత మరో 10 లక్షల పైచిలుకు ఓటర్లు పెరిగారు. ఓటర్ల తుది జాబితా ప్రకారం 1,58,71,493 మంది పురుష ఓటర్లు, 1,58,43,339 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తేలింది.

గత రెండు రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్దంపై ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో తుది ఓటర్లు జాబితాను అప్పుడే ప్రకటించవద్దని తెలంగాణ కాంగ్రెస్ కోరింది. అయితే ఓటర్ల జాబితాను పూర్తిగా పరిశీలించామని, క్షేత్ర స్థాయిలో కూడా సర్వే పూర్తి చేశామని ఎన్నికల అధికారులు స్పష్టం చేయడంతో.. ఈసీ అధికారికంగా బుధవారం సాయంత్రం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. తుది ఓటర్ల జాబితాను అన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌ల వద్ద ప్రదర్శించనున్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచుతారు.

ప్రస్తుతం సీఈసీ బృందం రాష్ట్రంలో పర్యటన పూర్తయిన తర్వాత ఢిల్లీకి చేరుకుంటారు. ఈ నెల 10లోగా ఎప్పుడైనా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


పురుష ఓటర్లు - 1,58,71,493

మహిళా ఓటర్లు - 1,58,43,339

ట్రాన్స్‌జెండర్ ఓటర్లు - 2,557

కొత్త ఓటర్లు - 17.01 లక్షలు

తొలగించిన ఓటర్లు - 6.10 లక్షలు

ఓటర్ల జాబితా ప్రకారం లింగ నిష్ఫత్తి - 998:1000

మొత్తం ఓటర్లు - 3,17,17,389

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC