రాష్ట్రంలో 3.26 కోట్ల ఓటర్లు.. మహిళలే అధికం!

రాష్ట్రంలో ఫస్ట్‌టైం మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను మించిపోయింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను దాదాపు 75 నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.

Advertisement
Update: 2023-11-12 03:07 GMT

తెలంగాణలో ఓటర్ల సంఖ్య తేలిపోయింది. అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 18 వేల 205కు చేరుకుంది. ఈ నెల 5న తుది ఓటర్ల జాబితా ప్రకటించగా.. తర్వాత వచ్చిన ఓటర్ల నమోదు దరఖాస్తులను పరిశీలించిన ఎలక్షన్ కమిషన్ శుక్రవారం అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షలు దాటింది. వీరిలో కోటి 62 లక్షల 98 వేల 418 మంది పురుషులు, కోటి 63 లక్షల 17 వందల 5 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

రాష్ట్రంలో ఫస్ట్‌టైం మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను మించిపోయింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను దాదాపు 75 నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 44 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. 26 జిల్లాల్లో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. ఏడు జిల్లాలు కుమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తిలో మాత్రమే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. మిగిలిన అన్ని జిల్లాల్లో మహిళలదే పైచేయి.

ఇక రాష్ట్రంలో కొత్త ఓటర్ల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. దాదాపు 9 లక్షల 99 వేల 667 మంది కొత్త ఓటర్లు యాడ్‌ అయ్యారు. అక్టోబర్‌ 4న ప్రకటించిన జాబితాలో 18-19 సంవత్సరాల ఓటర్లు 8 లక్షల 11 వేల 648 మంది ఉన్నారు. అక్టోబర్‌ 31 తర్వాత మరో లక్షా 88 వేల 19 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్లలో ట్రాన్స్‌జెండర్లు 2 వేల 676, సర్వీసు ఓటర్లు 15 వేల 406 మంది ఉన్నారు.

ఇక పోస్టల్ బ్యాలెట్‌ సదుపాయం కోసం భారీగానే దరఖాస్తులు వచ్చాయి. దివ్యాంగులు, వయోజనులు, ఎన్నికలతో సంబంధం లేని అత్యవసర సేవల్లో ఉండే ఓటర్లు కలిపి మొత్తం 31 వేల 551 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా సిద్దిపేటలో 757 మంది..అతి తక్కువగా మక్తల్‌ నుంచి 5 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు ఇంటి వద్దే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నారు.


Tags:    
Advertisement

Similar News