ఔటర్ రింగ్‌ రోడ్డు లీజుపై తప్పుడు కథనాలు.. లీగల్ నోటీసు పంపిన హెచ్ఎండీఏ

ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ ఈ లీజుపై ఒక నిరాధార వార్తను ప్రచురించడంపై హెచ్ఎండీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement
Update: 2023-05-25 00:29 GMT

హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును ఇటీవల ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా అనే సంస్థకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. ఓఆర్ఆర్ నిర్వహణ, టోల్ వసూలు, అప్పగింత పద్దతిలో లీజు కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) టెండర్లు పిలవగా.. అత్యధికంగా కోట్ చేసిన ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాకు లీజు దక్కింది. ఈ లీజు డబ్బులను మూడు నెలల లోగా చెల్లించాలని, ముందుగా 10 శాతం ఇవ్వాలని నిబంధనలో పేర్కొన్నారు. కాగా, ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రానికల్ ఈ లీజుపై ఒక నిరాధార వార్తను ప్రచురించడంపై హెచ్ఎండీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసు పంపింది.

IRB says is can't pay 10% advance of total bid అనే శీర్షికతో ఈ నెల 24న వార్త ప్రచురించగా.. దానిపై హెచ్ఎండీఏ స్పందించింది. డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని.. ఈ వార్తా కథనం వల్ల హెచ్ఎండీఏ ప్రతిష్టతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు కూడా భంగం కలిగిందని పేర్కొన్నది. ఔటర్ రింగ్ రోడ్ లీజ్ అంశాలపై వార్తా కథనాలు ప్రచురించే ముందు వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలని హెచ్ఎండీఏ విజ్ఞప్తి చేసింది. ఓఆర్ఆర్‌ టెండర్‌కు సంబంధించిన నిబంధనలు అన్నీ పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని పరిశీలించకుండా, వాస్తవాలు నిర్ధారించుకోకుండా ఏకపక్షంగా కథనాన్ని ప్రచురించిందని హెచ్ఎండీఏ పేర్కొన్నది.

డీసీ పత్రిక వార్తలో పేర్కొన్న అంశాల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని.. ఇది హెచ్ఎండీఏ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నదని స్పష్టం చేసింది. సంచలనాల కోసం మీడియా బాధ్యతారాహిత్యంగా వార్తలను ప్రచురించరాదని హెచ్ఎండీఏ సూచించింది. రాజకీయ పార్టీలు, నాయకులు చేసే ఆరోపణలపై వాస్తవాలను నిర్ధారించుకొని ప్రజలకు, పాఠకులకు వార్తలు చేరవేయాలని హెచ్ఎండీఏ విజ్ఞప్తి చేసింది. డెక్కన్ క్రానికల్ వార్త వారి పాఠకులను, ప్రజలను తప్పుదోవ పట్టించేలాగా ఉందని తెలిపింది.

ఇలాంటి వార్తలు ప్రచురించి హెచ్ఎండీఏ ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా.. పత్రికా విలువలకు కూడా తిలోదకాలు ఇచ్చిందని సంస్థ పేర్కొన్నది. మరో వైపు ఐఆర్‌బీ సంస్థ యాజమాన్యం కూడా డెక్కన్ క్రానికల్‌కు లీగల్ నోటీసు జారీ చేసింది. డీసీ వార్తపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేసింది. తాము నిబంధనలు అన్నీ పాటిస్తూ లీజ్ దక్కించుకున్నామని.. ఆ తర్వాత కూడా హెచ్ఎండీఏ మార్గదర్శకాలను పాటిస్తున్నామని.. కానీ నిరాధారమైన వార్తను ప్రచురించడం విచారకరమని ఐఆర్‌బీ యాజమాన్యం పేర్కొన్నది.

Tags:    
Advertisement

Similar News