గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పనకు పరిశ్రమల విస్తరణ ముఖ్యం : మంత్రి కేటీఆర్

నగరాలు, పట్టణాల్లో సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Advertisement
Update: 2023-05-08 03:20 GMT

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలంటే పరిశ్రమల ఏర్పాటు, విస్తరణ చాలా ముఖ్యమని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేవలం నగరాలు, పట్టణాల్లో సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లో సోమవారం ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

దేవాపూర్‌లో ఇప్పటికే ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్‌కు ఉన్న 5 మెట్రిక్ టన్స్ పర్ యాన్యువల్ (ఎంటీపీఏ) పరిశ్రమను.. 8 ఎంటీపీఏకు పెంచనున్నారు. రూ.2వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ విస్తరణ పనులకు మంత్రి పునాది రాయి వేస్తారు. ఈ పరిశ్రమ విస్తరణ అనంతరం 4 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశలు లభిస్తాయని మంత్రి చెప్పారు.

ఇవాళ మంత్రి కేటీఆర్ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటిస్తారు. ముందుగా మంచిర్యాల జిల్లాలో పర్యటించిన అనంతరం పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనికి వస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్తగా నిర్మించిన కమిషనరేట్ ప్రారంభిస్తారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సహకారంతో ఈ ఆధునిక కమిషనరేట్ నిర్మించారు. గోదావరిఖని-రామగుండం మధ్య ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలోని 29 ఎకరాల స్థలంలో ఈ సువిశాల కమిషనరేట్ నిర్మించారు.

ఇక మధ్యాహ్నం 4 గంటలకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే పైలాన్‌ను మంత్రి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని, ప్రసంగిస్తారు.


Tags:    
Advertisement

Similar News