ఎన్నికల కోడ్ తో బంగారు వ్యాపారులకు చిక్కులు.. ఎలాగంటే..?
కేవలం పాట్ మార్కెట్ వ్యాపారులే కాదు.. ఇలాంటి బిజినెస్ జరిగే అన్నిచోట్లా ఇదే పరిస్థితి. తమ రోజువారీ వ్యాపారం ఇదని, ఎన్నికలకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా కూడా కొన్నిసార్లు పోలీసులు అడ్డుపడుతున్నారని వ్యాపారులు వాపోతున్నారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ స్ట్రిక్ట్ గా అమలవుతోంది. చీమ చిటుక్కుమంటే చాలు అధికారులు తెరపైకి వస్తున్నారు. పైగా ఎన్నికల కమిషన్ 10మంది ఐఏఎస్, ఐపీఎస్ లపై బదిలీ వేటు వేయడంతో.. మిగతావాళ్లు హడలిపోతున్నారు. మరింత స్ట్రిక్ట్ గా డ్యూటీ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో సామాన్యులు ఇబ్బందిపడటం విశేషం.
రూ.50వేలకు మించి నగదు..
ఈ నిబంధన చాలా చోట్ల సామాన్యులను కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. 50వేల రూపాయలకంటే ఎక్కువ డబ్బు దగ్గర ఉంటే దానికి లెక్కలు చూపాల్సిందేనంటున్నారు పోలీసులు. లెక్క చెప్పకపోతే నిర్దాక్షిణ్యంగా సీజ్ చేస్తామంటున్నారు. పైగా బంగారం, వెండి తీసుకెళ్తున్నా దానిక్కూడా లెక్కలు చెప్పాల్సిందేనంటున్నారు. ఈ నిబంధనలు హైదరాబాద్ లోని బంగారు వ్యాపారులకు చిక్కులు తెచ్చిపెట్టాయి.
సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లో బంగారం, వెండి హోల్ సేల్ వ్యాపారం జరుగుతుంది. ఈ మార్కెట్ కి వచ్చేవారు 50వేల కంటే తక్కువ ఎవరూ తీసుకు రారు, అలాగే వివిధ షాపుల మధ్య కూడా బంగారం, వెండి మార్పిడి జరుగుతుంది. ఇప్పుడు పోలీసులు ఈ మార్కెట్ పరిసరాల్లో కూడా నిఘా పెట్టారు. 50వేలకంటే ఎక్కువ డబ్బులతో ఎవరైనా షాపు నుంచి బయటకొచ్చినా, షాపుల్లోకి వెళ్తున్నా కూడా లెక్కలు అడుగుతున్నారు. అలాగే బంగారం, వెండి తీసుకెళ్తున్న వ్యాపారులను కూడా చెకింగ్ ల పేరితో హడావిడి పెడుతున్నారు. కొంతమంది పోలీసుల్ని చూసి హడలిపోతున్నారు. చిరు వ్యాపారులు కూడా ఈ చెకింగ్ లతో విసుగెత్తిపోతున్నారు. తమ వ్యాపారం అంతా సక్రమంగానే జరుగుతోందని చెబుతున్నా కూడా పోలీసులు విడిచిపెట్టడంలేదంటున్నారు. పైగా డబ్బు, బంగారం సీజ్ చేస్తున్నారని.. వాటిని విడిపించుకోవాలంటే తమ తలప్రాణం తోకకు వస్తోందని వాపోతున్నారు.
కేవలం పాట్ మార్కెట్ వ్యాపారులే కాదు.. ఇలాంటి బిజినెస్ జరిగే అన్నిచోట్లా ఇదే పరిస్థితి. తమ రోజువారీ వ్యాపారం ఇదని, ఎన్నికలకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా కూడా కొన్నిసార్లు పోలీసులు అడ్డుపడుతున్నారని వ్యాపారులు వాపోతున్నారు. కస్టమర్లు కూడా సరిగా రావడంలేదని బిజినెస్ దెబ్బతింటోందని అంటున్నారు.