కేసీఆర్‌ను ఈటల తట్టుకోగలరా?

ఒకప్పుడు చాలా భీకరంగా కేసీఆర్‌ను చాలెంజ్ చేసిన ఈటల ఇప్పుడు మాట్లాడటం లేదు. జాబితా ప్రకటించిన తర్వాత కూడా ఈటల ఎందుకు స్పందించలేదో అర్థంకావటంలేదు.

Advertisement
Update: 2023-08-23 06:28 GMT

రాబోయే ఎన్నికలకు సంబంధించి కేసీఆర్‌ మొదటి జాబితా ప్రకటించిన తర్వాత అందరి దృష్టి ఈటల రాజేందర్ మీదపడింది. 119 నియోజకవర్గాల్లో మొదటి జాబితాగా కేసీఆర్‌ 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో నాలుగు నియోజకవర్గాల్లో హోల్డులో ఉంచారు. తొందరలోనే ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించేస్తామన్నారు. ఇంతవరకు బాగానే ఉంది మరిప్పుడు ఈటల ఏం చేస్తారు? అన్నదే ఆసక్తిగా మారింది.

ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ ఎక్కడ పోటీ చేస్తే తాను కూడా అక్కడ పోటీ చేసి ఓడిస్తానని చాలెంజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. గజ్వేలు నియోజకవర్గం కావచ్చు ఇంకేదైనా నియోజకవర్గం కూడా కావచ్చని ఈటల చాలెంజ్ చేశారు. సో కేసీయార్ విడుదల చేసిన జాబితా ప్రకారం గజ్వేలు, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోను పోటీ చేయబోతున్నారు. మరి ఈటల ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు?

గజ్వేలులో పోటీ చేస్తారా? లేకపోత కామారెడ్డిలో పోటీకి రెడీ అవుతారా? అన్నది ఆసక్తిగా మారింది. అప్పట్లో చెప్పిన ప్రకారమైతే ఈటల గజ్వేలులో పోటీకి సవాలన్నారు. గజ్వేలులో తాను పోటీకి రెడీ అయితే మరి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఏం చేస్తారు? కేసీఆర్‌ లెక్కలోనే ఈటల కూడా హుజూరాబాద్‌తో పాటు రెండో నియోజకవర్గంలో కూడా పోటీకి రెడీ అవుతారా? అసలు గజ్వేలు సంగతిని ఏం చేస్తారో ముందు ఈటల చెప్పాల్సి ఉంది.

ఒకప్పుడు చాలా భీకరంగా కేసీఆర్‌ను చాలెంజ్ చేసిన ఈటల ఇప్పుడు మాట్లాడటం లేదు. జాబితా ప్రకటించిన తర్వాత కూడా ఈటల ఎందుకు స్పందించలేదో అర్థంకావటంలేదు. తన చాలెంజ్ మీద తాను నిలబడేట్లయితే ఈపాటికే ఈటల స్పందించుండే వారే. గజ్వేలు లేదా కామారెడ్డిలో ఎక్కడైనా సరే కేసీఆర్‌ను ఈటల తట్టుకోగలరా? అన్నదే అసలైన పాయింట్. ఇపుడున్న పరిస్థితుల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోటీ చేయటం అంటే పులి నోట్లో తలపెట్టడం అనే అనుకోవాలి. రేపటి ఎన్నికల్లో గెలుపు కూడా ఈటలకు చాలా అవసరమే.


Tags:    
Advertisement

Similar News