అసంతృప్తులకు కాంగ్రెస్ బుజ్జగింపులు.. వెయ్యి నామినేటెడ్ పోస్టులు

మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ.. ఇప్పటివరకూ పార్టీ 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదిరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement
Update: 2023-10-12 02:17 GMT

టికెట్ ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించే పనిలో పడింది హస్తం పార్టీ. నామినేటెడ్‌ పదవులను ఆశ చూపి సర్ది చెప్తోంది. అధికారంలోకి వస్తే దాదాపు వెయ్యి నామినేటెడ్‌ పదవులు ఇస్తామని హామీ ఇస్తోంది. అక్టోబర్‌ 16న ఫస్ట్ లిస్ట్ విడుదల చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో టికెట్ రాని వారు ఎదురుతిరిగే అవకాశం ఉందని హస్తం పార్టీ ఆందోళన చెందుతోంది.

అధికారంలోకి వస్తే ప్రభుత్వం, స్థానిక సంస్థలు, దేవాలయాలు, మార్కెట్‌ కమిటీల్లో ఉన్న వెయ్యి నామినేటెడ్ పదవులతో పాటు.. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం 50కి పైగా కొత్త కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి ఛైర్మన్‌లను చేయాలని యోచిస్తోంది. ఈ కార్పొరేషన్‌లకు కేబినెట్ హోదా ఇస్తామని ఆశ చూపుతోంది. వీటితో పాటు జిల్లాల్లో సహకార కేంద్ర బ్యాంకులు, సహకార మార్కెటింగ్ సొసైటీల ఛైర్మన్లు, వైస్ ఛైర్‌పర్సన్ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది.

మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ.. ఇప్పటివరకూ పార్టీ 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదిరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ 70 నియోజకవర్గాల్లో కూడా అనేక మంది ఆశావహులు ఉన్నప్పటికీ.. వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి శాంతింపజేయాలని పార్టీ భావిస్తోంది. ఇక మిగిలిన 49 స్థానాల్లో కనీసం 30 స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. ఒక్కొ నియోజకవర్గంలో ముగ్గురు నుంచి నలుగురు తీవ్రంగా పోటీ పడుతున్నారు.

ముందుగా పార్టీ అధికారంలోకి రావడానికి వారిని ఒప్పించాలని నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ, కుల సమీకరణాల కారణంగా టిక్కెట్లు దక్కని అగ్రనేతలకు ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు కూడా ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇస్తోంది.

Tags:    
Advertisement

Similar News