కేబినెట్‌ విస్తరణపై రేవంత్‌ ఫోకస్‌.. వీరికే ఛాన్స్‌!

ఇక గ్రేటర్ హైదరాబాద్‌ నుంచి ఓ లీడర్‌ను మండలికి పంపి మంత్రిగా అవకాశం ఇస్తారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update: 2024-05-24 07:34 GMT

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. జూన్‌ 4న లోక్‌సభ ఫలితాలు రానున్నాయి. పంచాయతీ ఎన్నికలు జూన్ చివర్లో జరిగినా, మరింత ఆలస్యమైనా.. ఆ ఎన్నికలతో సంబంధం లేకుండా ఆగస్టు 15 నాటికి పూర్తిస్థాయిలో కేబినెట్‌ ఉండాలన్న పట్టుదలతో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కేబినెట్‌లో 11 మంది మంత్రులు ఉన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మంత్రుల పనితీరు సమీక్షించి మార్పులు చేర్పులు చేస్తామని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించినప్పటికీ.. ఆ దిశగా ఎలాంటి చర్యలు ఉండవని తెలుస్తోంది.

మంత్రి పదవి రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ప్రేమ్‌ సాగర్‌ రావు ముందువరుసలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ నుంచి ఇప్పటికే ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మంత్రులుగా ఉండడంతో పాటు కేబినెట్‌లో ఇప్పటికే నలుగురు రెడ్డిలు ఉండడంతో రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కుతుందనేది అనుమానమే.

ఇక గ్రేటర్ హైదరాబాద్‌ నుంచి ఓ లీడర్‌ను మండలికి పంపి మంత్రిగా అవకాశం ఇస్తారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. వారికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నాయని హస్తం నేతలు చెప్తున్నారు. వీరితో పాటు ఎస్టీ, ముదిరాజ్‌ సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో చోటు దక్కనుంది. ఎస్టీ సామాజికవర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, ముదిరాజ్ సామాజికవర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వి.శ్రీహరి ముదిరాజ్‌ ఆశావహులుగా ఉన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో శ్రీహరి ముదిరాజ్‌ను మంత్రిని చేస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. 

Tags:    
Advertisement

Similar News