చేరికలకు ముహూర్తం.. ఈనెల 11న భద్రాచలంకు సీఎం రేవంత్

ఈనెల 11న సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం వెళ్తున్నారు. ముందుగా సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం భద్రాచలంలో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో ఆయన పాల్గొంటారు.

Advertisement
Update: 2024-03-04 07:37 GMT

భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సీఎం రేవంత్ రెడ్డిని కలసిన తర్వాత పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. స్థానిక అభివృద్ధి గురించి సీఎంకు ఎమ్మెల్యే అలా వినతిపత్రం ఇచ్చారో లేదో, ఇలా ఆ నియోజకవర్గానికి సీఎం పర్యటన ఖరారైపోయింది. ఈనెల 11వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం వెళ్లబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. భద్రాచలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత చేరికల కార్యక్రమాలు ఉంటాయని అంటున్నారు.

ఎమ్మెల్యే వెళ్లిపోతారా..?

తెల్లం వెంకట్రావు ఎన్నికల వేళ అటు ఇటు మారి.. చివరకు ఎలాగోలా బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. కానీ ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారనే అనుమానాలు రోజు రోజుకీ బలపడుతున్నాయి. ఇటీవలే కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే తెల్లం. ఆ వెంటనే ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాను కాంగ్రెస్ లో చేరడంలేదని, అది కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం జరిగిన భేటీ అని వివరణ ఇచ్చారు. తీరా ఇప్పుడు మందీ మార్బలంతో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే వార్తలు వినపడుతున్నాయి.

ఈనెల 11న సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం వెళ్తున్నారు. ముందుగా సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం భద్రాచలంలో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో ఆయన పాల్గొంటారు. ఈ మీటింగ్‌లో భద్రాచలం ఎమ్మెల్యే‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు బీఆర్ ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC