కొండగట్టులో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు.. హెలీకాప్టర్‌ నుంచి ఆలయం పరిశీలన

కేసీఆర్ ఆలయం వద్దకు చేరుకోగానే మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమాలాకర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Advertisement
Update: 2023-02-15 09:04 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అక్కడి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టును రాష్ట్రంలోని మిగతా ఆలయాల లాగానే అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బడ్జెట్‌లో ఈ సారి రూ.100 కోట్లు కేటాయించారు. దీనికి సంబంధించి ఎలాంటి పనులు చేపట్టాలనే విషయాలను కాసేపట్లో జరిగే సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.

కాగా, ఉదయం 9.05 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరి కొండగట్టు చేరుకున్నారు. కేసీఆర్ ఆలయం వద్దకు చేరుకోగానే మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమాలాకర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అర్చకులు సీఎంకు పూర్ణకుంభంతో ఆలయంలోకి ఆహ్వానించారు. హెలీకాప్టర్ నుంచే కేసీఆర్ ఆలయ పరిసరాలను పరిశీలించారు. కాగా, కొండగట్టు క్షేత్ర అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన బాధ్యతలను ఆర్కిటెక్ట్ ఆనందసాయికి అప్పగించింది. గతంలో యాదాద్రికి కూడా ఆయనే ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించడం గమనార్హం.

బంజారాలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..

బంజారా, లంబాడాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ దేశం గర్వించదగిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త అని సీఎం కేసీఆర్ అన్నారు. కొండగట్టుకు బయలుదేరడానికి ముందు సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా లంబాడా, బంజారా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇవ్వాళ బంజారాహిల్స్‌గా పిలవబడుతున్న ప్రాంతంలో మూడు శతాబ్దాల క్రితమే సేవాలాల్ మహారాజ్ నడయాడారని.. ఇప్పుడు అదే ప్రాంతంలో వారి పేరుతో భవన్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు.హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రాంతంలో సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతోనే బంజారా భవన్‌ను వారి ఆత్మగౌరవం ఉట్టిపడేలా నిర్మించామని అన్నారు. ఇక్కడ విగ్రహం స్థాపించి.. ప్రతీ ఏడా అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.


Tags:    
Advertisement

Similar News