సీఎం పదవి ఇస్తే బాధ్యతగా స్వీకరిస్తా..- భట్టి విక్రమార్క

అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలంతా ఒకచోట చేరతామని, వారు సీఎల్పీ లీడర్‌గా కొనసాగమని కోరితే కొనసాగుతానని భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement
Update: 2023-12-03 10:05 GMT

తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాధ్యతగా స్వీకరిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దొరల తెలంగాణ పాలన పోయి.. ప్రజల తెలంగాణ పాలన వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించామని.. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు.

ఫస్ట్ క్యాబినెట్ భేటీలో 6 గ్యారంటీలపై చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలంతా ఒకచోట చేరతామని, వారు సీఎల్పీ లీడర్‌గా కొనసాగమని కోరితే కొనసాగుతానని భట్టి విక్రమార్క తెలిపారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను ప్రజా తెలంగాణ భవన్‌గా మారుస్తామని ప్రకటించారని.. ఆయన ప్రకటించిన విధంగానే ప్రగతి భవన్‌ను ప్రజా పాలన భవన్‌గా మారుస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.

కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నరకాసురుడి పాలనను ఇంటికి పంపినట్లు చెప్పారు. హిట్లర్ ఇక ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకున్నారని.. వారు కోరుకున్నట్లుగానే ఇందిరమ్మ పాలన వచ్చింద‌న్నారు. 

Tags:    
Advertisement

Similar News