చార్మినార్ బీజేపీ అభ్యర్థిని అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు ఉత్తర్వులు

ఎన్నికల వేళ పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశముందని, అరెస్ట్ ని అడ్డుకోవాలంటూ ఆమె హైకోర్టుని కోరారు. ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం వివరణ ఇచ్చేందుకు పిటిషనర్లకు అవకాశం ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.

Advertisement
Update: 2023-11-29 04:09 GMT

ఎన్నికల వేళ చార్మినార్ బీజేపీ అభ్యర్థి వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అభ్యర్థి మేఘారాణి అగర్వాల్, బీజేపీ నాయకుడు పవన్ మిస్త్రాకు ఇటీవల పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసులు తమను అరెస్ట్ చేయబోతున్నారని, తాము వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం మేఘా రాణి అగర్వాల్‌, పవన్‌ మిస్త్రాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చింది. ర్యాలీలో జరిగిన వివాదంపై వివరణ ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నందున, వారి వివరణ వినాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వెలువడిన నాటి నుంచి 3 రోజుల్లోగా పోలీసులు ఇచ్చిన సీఆర్‌పీసీ 41ఏ నోటీసులకు వివరణ ఇవ్వాలని పిటిషనర్లకు చెప్పింది హైకోర్టు.

అసలేం జరిగింది..?

మేఘా రాణి అగర్వాల్‌ చార్మినార్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 9న బీజేపీ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా గందరగోళం చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మేఘారాణి అగర్వాల్ వ్యాఖ్యల వల్లే ఈ గందరగోళం చెలరేగిందని పోలీసులు నిర్థారణకు వచ్చారు. ర్యాలీలో గందరగోళంపై ఫిర్యాదులు రావడంతో.. మేఘారాణి అగర్వాల్ సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈనెల 22న 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై మేఘారాణి అగర్వాల్ హైకోర్టుని ఆశ్రయించారు.

ఎన్నికల వేళ పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశముందని, అరెస్ట్ ని అడ్డుకోవాలంటూ ఆమె హైకోర్టుని కోరారు. ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం వివరణ ఇచ్చేందుకు పిటిషనర్లకు అవకాశం ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో మేఘారాణి అగర్వాల్ కు ఊరట లభించినట్టయింది. 


Tags:    
Advertisement

Similar News