ఏపీ భవన్‌పై కేంద్రం కొత్త ప్రతిపాదన.. మరో ఆప్షన్ పెట్టిన తెలంగాణ..!

పటౌడి హౌస్, 7.64 ఎకరాల స్థలం తెలంగాణ తీసుకోవాలని కేంద్రం ప్రతిపాదించింది. ఏపీకి గోదావరి, శబరి బ్లాక్స్‌తో పాటు నర్సింగ్ హాస్టల్ పక్కన ఉన్న 12.09 ఎకరాలు కేటాయించింది.

Advertisement
Update: 2023-05-05 01:37 GMT

ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన కొలిక్కి రావడం లేదు. ఆ భవనాన్ని పూర్తిగా తమకే ఇచ్చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. సదరు భవనంతో తెలంగాణకు భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయని.. కాబట్టి భవనంపై పూర్తి హక్కులు తమకే ఇవ్వాలని కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. గత నెల 26న కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ జరిగింది. దీని తర్వాత రెండు ఆప్షన్లు ఇస్తూ కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాలకు తాజాగా లేఖ రాసింది.

పటౌడి హౌస్, 7.64 ఎకరాల స్థలం తెలంగాణ తీసుకోవాలని కేంద్రం ప్రతిపాదించింది. ఏపీకి గోదావరి, శబరి బ్లాక్స్‌తో పాటు నర్సింగ్ హాస్టల్ పక్కన ఉన్న 12.09 ఎకరాలు కేటాయించింది. అయితే తెలంగాణ ఈ ప్రతిపాదనకు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. తమకే గోదావరి, శబరి బ్లాకులతో పాటు నర్సింగ్ హాస్టల్, దాని పక్కన ఉన్న 12.09 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. పటౌడీ హౌస్, 7.64 ఎకరాల స్థలం ఏపీకి ఇచ్చేయమని చెబుతోంది. తెలంగాణ పెట్టిన ప్రతిపాదన పూర్తిగా విరుద్దంగా ఉందని.. జనాభా నిష్పత్తి ప్రకారం వారికి ఎక్కువ స్థలం వెళ్తుందని ఏపీ వాదిస్తోంది.

తెలంగాణ అధికారులు మాత్రం గోదావరి, శబరి బ్లాక్‌లతో పాటు మొత్తం స్థలాన్ని, నర్సింగ్ హాస్టల్‌ను తమకు కేటాయించాలని, పటౌడి బ్లాక్ మాత్రం ఏపీకి ఇచ్చేయాలని కోరతామంటున్నారు. అది తెలంగాణకు రావల్సిన షేర్ కంటే ఎక్కువగా ఉంటే.. అదనపు భూమికి మార్కెట్ రేట్ ప్రకారం ఏపీ ప్రభుత్వానికి చెల్లిస్తామని ప్రతిపాదించామని చెప్పారు.

తెలంగాణ కొత్త ప్రతిపాదనను మేము ప్రభుత్వానికి తెలియజేస్తామని ఏపీ స్పెషల్ సెక్రటరీ చెప్పారు. కేంద్రం కూడా తెలంగాణ పెట్టిన ప్రతిపాదనను పరిశీలిస్తామని చెబుతున్నది. ఒక వేళ తెలంగాణకు జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ షేర్ వెళ్లినట్లయితే.. మార్కెట్ రేటు ఏపీకి చెల్లించేలా ఇరు రాష్ట్రాలు ఒప్పుకుంటే ఏపీ భవన్ విభజన సమస్య ఒక కొలిక్కి వచ్చినట్లే అని కేంద్ర హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ ప్రతిపాదనపై ఇరు రాష్ట్రాలు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

Tags:    
Advertisement

Similar News