బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండదు.. - ఈటల రాజేందర్

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొందాలంటే మరింత బలం పెంచుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం పార్టీలోని కార్యకర్తల బలం పెంచుకోవడంతోపాటు.. ఇతర పార్టీలోని సీనియర్ నేతలు పార్టీలోకి రావాలని కోరుకుంటున్నట్లు ఈటల తెలిపారు.

Advertisement
Update: 2023-05-24 13:39 GMT

రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండదని ఆ పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తనకు బండి సంజయ్ కి మధ్య గొడవ జరిగిందన్న ప్రచారంపై ఈట‌ల స్పందించారు. తాను గొడవలు పడే వ్యక్తిని కాదన్నారు. ఏ పార్టీలో అయినా కొత్త నాయకుడు చేరిన సమయంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయని, కొత్త, పాత నేతలు సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని, అందులో ఎటువంటి మార్పు ఉండదన్నారు. బండి సంజయ్ పార్టీ అభివృద్ధి కోసం ఆయ‌న శక్తి మేరకు పనిచేస్తున్నారన్నారు.

పార్టీ మారినప్పుడు పదవులను ఆశించడం దేశంలో కామన్ అని, అయితే తాను మాత్రం ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని ఈటల అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పదవి కావాలని నోరు తెరచి అడగలేదని, ముందు ముందు కూడా అడగబోనని చెప్పారు. తనను పార్టీ ఎలా ఉపయోగించుకుంటుంది అనేది పార్టీ హైకమాండ్ ఇష్టమన్నారు. తనకు ఏ బాధ్యతలు ఇవ్వాలన్నది హైకమాండ్ చూసుకుంటుందన్నారు. పార్టీ పెద్దలు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని ఈటల చెప్పారు.

పార్టీ తనకు చేరికల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రంలోని పలువురు నేతలను బీజేపీలోకి తీసుకురావడానికి ప్రయత్నించానని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో జరిగే విషయాలను కళ్ళతో చూసి, చెవులతో విని నిర్ణయాలు తీసుకుంటాయని, జాతీయ పార్టీల పరిస్థితి ఆ విధంగా ఉండదు కాబట్టే రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించడానికి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుందని ఈటల అన్నారు. తాను కూడా అందుకే ఢిల్లీకి వెళ్లానని ఆయన స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొందాలంటే మరింత బలం పెంచుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం పార్టీలోని కార్యకర్తల బలం పెంచుకోవడంతోపాటు.. ఇతర పార్టీలోని సీనియర్ నేతలు పార్టీలోకి రావాలని కోరుకుంటున్నట్లు ఈటల తెలిపారు. తనను కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించడంపై ఈటల స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ముందు ఆయన పార్టీని కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేతలు ఎత్తుకుపోకుండా చూసుకోవాలని హితవు పలికారు.

Tags:    
Advertisement

Similar News