రేవంత్ దెబ్బకు తోకముడిచారా..?

దేవాలయంలో ఎంతసేపు వెయిట్ చేసినా ఈటల మాత్రం అడ్రస్ లేరు. ఈటల ఇకరారు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత రేవంత్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement
Update: 2023-04-23 04:51 GMT

నోటికొచ్చింది మాట్లాడేయటం, ఛాలెంజులు చేసేయటం ప్రత్యర్థి గట్టిగా ఎదురుతిరిగితే తోకముడిచేయటం కమలనాధులకు అలవాటైపోయింది. తాజాగా భాగ్యలక్ష్మి దేవాలయం కేంద్రంగా జరిగిన ఓ ఘటనలో ఈ విషయం బయటపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆ మధ్య జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీ రూ. 25 కోట్లు తీసుకున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇక్కడ ఈటల టార్గెట్ ఏమిటంటే కేసీఆర్ పై బురదచల్లేయటమే.

అయితే ఊహించని విధంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రియాక్టయ్యారు. కేసీఆర్ దగ్గర కాంగ్రెస్ కోట్ల రూపాయలు తీసుకున్నదని ఈటల ఆరోపణలు చేస్తే మరి కాంగ్రెస్ స్పందించకుండా ఎలాగుంటుంది..? అందుకనే రేవంత్ స్పందించారు. రెండువైపులా ఛాలెంజులు అయిన తర్వాత భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణాలు చేసుకుందాం అనుకున్నారు. అనుకున్నట్లుగానే శనివారం మధ్యాహ్నం రేవంత్ ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. పూజలు నిర్వహించి అమ్మవారి పట్టువస్త్రాన్ని కప్పుకుని కేసీఆర్ నుంచి కాంగ్రెస్ ఎలాంటి ముడుపులు తీసుకోలేదని ప్రమాణంచేశారు.

దేవాలయంలో ఎంతసేపు వెయిట్ చేసినా ఈటల మాత్రం అడ్రస్ లేరు. ఈటల ఇకరారు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత రేవంత్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తం ఎపిసోడ్ లో ఈటల తోకముడిచేశారు అనే ప్రచారం పెరిగిపోయింది. ప్రమాణం తర్వాత ఈటలపై కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతుంటే బీజేపీ డిఫెన్సులో పడిపోయింది. సమర్థించుకునేందుకు కూడా అవకాశంలేనంతగా బీజేపీ డిఫెన్సులో పడిపోవటానికి ఈటలే కారణమని కమలనాధులు కూడా మండిపోతున్నారట.

ఈటల అనాలోచిత ఆరోపణల వల్లే పార్టీ జనాల్లో పలుచనైపోయిందని బీజేపీ నేతలు కూడా తప్పుపడుతున్నట్లు సమాచారం. ఆర్థిక ఆరోపణలు చేసేటప్పుడు ముందుగా అన్నీ ఆధారాలను దగ్గర పెట్టుకోవాలని ఈటలకు తెలీదా అంటు పార్టీ నేతలే నిలదీస్తున్నారట. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటమే తప్పయితే ఛాలెంజి చేసినప్పుడు దేవాలయానికి వెళ్ళకుండా తప్పించుకోవటం మరో తప్పంటూ ఇప్పుడు బీజేపీ నేతలంతా ఈటలనే నిందిస్తున్నారట. ఈటల వల్ల బీజేపీ ఇమేజి దెబ్బతిన్నదని, రేపు ఇంకెవరైనా ఎవరిపైన ఆరోపణలు చేసినా జనాలు పట్టించుకునేట్లు లేరని మండిపోతున్నారట.

Tags:    
Advertisement

Similar News