గజ్వేల్‌ బరిలో ఈటల.. కేసీఆర్‌పై పోటీకి సై..!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి కేసీఆర్‌ పోటీచేయనుండటంతో.. గజ్వేల్‌లో ఆయనపై బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్ పోటీ చేస్తారని సమాచారం.

Advertisement
Update: 2023-09-10 02:10 GMT

గజ్వేల్‌ బరిలో ఈటల ఉంటున్నారా..! గతంలో విసిరిన సవాల్‌కు కట్టుబడి కేసీఆర్‌పై పోటీకి రెడీ అయిపోయారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గజ్వేల్‌ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తరఫున ఆ నియోజకవర్గ నేతలు దరఖాస్తు సమర్పించారు. దీంతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తామంటూ గతంలో చాలాసార్లు సవాల్ విసిరారు ఈటల రాజేందర్‌. తానే స్వయంగా కేసీఆర్‌పై పోటీ చేస్తానంటూ ప్రకటించారు. ఇక గజ్వేల్‌ పరిధిలో ఈటల సొంత సామాజిక వర్గం ముదిరాజ్‌ ఓట్లు కూడా భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గజ్వేల్‌ నుంచి పోటీకి సై అన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ కొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌, హరీష్‌ రావు సహా పలువురు మంత్రులపై బీజేపీ తరఫున బలమైన అభ్యర్థులను పోటీ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయా చోట్ల బీజేపీ గెలిస్తే బీఆర్ఎస్‌ ముఖ్యులను ఓడించినట్లు అవుతుందని.. ఒకవేళ బీజేపీ నేతలు ఓటమి పాలైనా తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌ ఇవ్వొచ్చని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి కేసీఆర్‌ పోటీచేయనుండటంతో.. గజ్వేల్‌లో ఆయనపై బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్ పోటీ చేస్తారని సమాచారం. ఇక మరోస్థానం కామారెడ్డిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను పోటీకి నిలపాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే కామారెడ్డిలో పోటీపై అర్వింద్‌ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. కేటీఆర్‌పై కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ని పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం భావస్తున్నట్లు సమాచారం.

ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆశావహులు తరలివచ్చారు. శనివారం ఒక్కరోజే 1603 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకూ మొత్తం 3,223 మంది అర్జీ పెట్టుకున్నారు. ఇక ఆదివారం దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News