యువతలో విషబీజాలు నాటుతున్న వారిని చూసి సిగ్గుపడుతున్నా : మంత్రి కేటీఆర్

ఇలాంటి విషపూరితమైన రాజకీయాల ఆసరా చూసుకొని.. యువతలో చాలా మంది విషబీజాలు నాటుతున్నారు.

Advertisement
Update: 2023-08-27 02:00 GMT

యువతలో విషబీజాలు నాటుతూ.. వారిని ముస్లింలపైకి ఎగదోస్తున్న వైనం చూస్తుంటే.. ఇవి ప్రస్తుత విషపూరిత రాజకీయాల పర్యవసానమే అని స్పష్టమవుతున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇటీవల యూపీలోని ఖుబ్బాపూర్‌లో ఒక ఉపాధ్యాయురాలు చేసిన మతపరమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక వర్గంపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. మరో వర్గానికి చెందిన వారితో రెండో తరగతి విద్యార్థికి చెంప దెబ్బలు వేయించడం తీవ్ర విమర్శలపాలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది.

ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా స్పందించారు. 'విద్వేషం, హింసతో కూడిన పనికిమాలిన రాజకీయాలను చూసి సిగ్గుపడుతున్నాను. ఇలాంటి విషపూరితమైన రాజకీయాల ఆసరా చూసుకొని.. యువతలో చాలా మంది విషబీజాలు నాటుతున్నారు. తమ పిల్లలకు ఏది అవసరమో భారత ప్రజలు తప్పకుండా తెలుసుకోవాలి. ఒకరిపై మరొకరికి పూర్తి విద్వేషంతో కూడిన ఇండియా కావాలా? లేదంటే భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన, శాంతికరమైన దేశం కావాలా నిర్ణయించుకోవాలి. గాంధేయవాద జాతీయవాదమా? గాడ్సే మార్క్ తీవ్రవాదమా అనేది ఎంపిక చేసుకోవాలి' అంటూ పోస్టు చేశారు.

కాగా, యూపీలో సంఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తం అయ్యింది. దీంతో పోలీసులు సదరు ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు చేశారు. అయితే తాను ఇలా చేయడం తప్పేనని ఉపాధ్యాయురాలు అంగీకరించింది. తాను దివ్యాంగురాలినని, అసైన్‌మెంట్ పూర్తి చేయకపోవడంతో విద్యార్థి వద్దకు వెళ్లలేక వేరే విద్యార్థులతో చెంప దెబ్బ కొట్టించానని పేర్కొన్నది.

ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ఉపాధ్యాయురాలితో పాటు పాఠశాలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అలాగే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రిపోర్టు అందించాలని పేర్కొన్నది.


Tags:    
Advertisement

Similar News