ఖమ్మం బీఆర్ఎస్ సభలో ఏపీదే కీలకపాత్రా..?

Advertisement
Update: 2023-01-14 04:13 GMT

ఈనెల 18వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ బహిరంగసభ జరగబోతోంది. ప్రాంతీయపార్టీ టీఆర్ఎస్ జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరగబోతున్న మొదటి సమావేశం ఇదే. అందుకనే కేసీఆర్ ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. మరి సభ గ్రాండ్ సక్సెస్ అయ్యేది సభకు వచ్చిన జనాలను బట్టేకదా. అందుకనే సభను సక్సెస్ చేయించే బాధ్యత ప్రధానంగా ఇద్దరు మంత్రులుపైన మోపారు కేసీఆర్.

మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్ తమ బాధ్యతల్లో చాలా బిజీగా ఉన్నారు. వీరే కాకుండా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్ధసారధి, రావెల కిషోర్ బాబు కూడా ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. దీనికి కారణం ఏమిటంటే ఖమ్మం బహిరంగసభ అంటే సరిహద్దుల్లో ఉన్న ఏపీ ప్రాంతాల జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భౌగోళికంగా ఖమ్మం తెలంగాణాలోనే ఉన్నప్పటికీ జిల్లా ప్రభావమంతా ఏపీదే అని చెప్పాలి.

ఎందుకంటే తెల్లారిలేస్తే ఖమ్మం జిల్లాలోని వేలాదిమంది జనాలు తమ అవసరాల కోసం విజయవాడ, ఏలూరు, విశాఖపట్నంకు వెళ్తూనే ఉంటారు. తమ వ్యాపార, కుటుంబ సంబంధాలన్నీ సీమాంధ్రులతోనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖమ్మం జిల్లాపై ఎక్కువగా ఏపీ ప్రభావమే కనబడుతుంది. దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవటానికే ఏపీలోని ఖమ్మం సరిహద్దు ప్రాంతాల నుండి జనాలను తరలించే బాధ్యతలను కేసీఆర్ పై ముగ్గురు ఏపీ నేతలపైన ఉంచారట. పశ్చిమగోదావరి, కృష్ణా, విజయవాడ ప్రాంతాలపైన ఎక్కువ దృష్టిపెట్టారు.

వీరికి అదనంగా మంత్రులు తలసాని, శ్రీనివాస గౌడ్ ఇప్పటికే ఏపీలో పర్యటించారు. వీళ్ళ పర్యటనలో యాదవ, గౌడ సంఘాల్లోని ప్రముఖులతో భేటీలు జరిపారు. కులసంఘాల నుండి ఖమ్మం బహిరంగసభకు జనాలను తరలించే బాధ్యతలను మంత్రులిద్దరు పై రెండు కులసంఘాల నేతలపైన మోపారట. ఏదేమైనా ఖమ్మం బహిరంగసభ సక్సెస్ లో ఏపీ నేతల పాత్ర మాత్రం కీలకంగా మారబోతున్నట్లు అనిపిస్తోంది. దీన్నిబట్టే రాబోయే రోజుల్లో ఏపీ బీఆర్ఎస్ యాక్టివిటీస్ ఉండబోతోందని అర్ధమైపోతోంది.

Tags:    
Advertisement

Similar News