పీసీసీ చీఫ్‌గా సీతక్క.. త్వరలోనే ప్రకటన..?

పీసీసీ చీఫ్‌ పదవి విషయంలో నిన్నామొన్నటి వరకు మధుయాష్కీ, జగ్గారెడ్డి లాంటి పేర్లు వినిపించాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సీతక్క పేరును తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం.

Advertisement
Update: 2024-05-25 09:44 GMT

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌ రెడ్డి పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణతో పాటు కొత్త‌ పీసీసీ అధ్యక్షుడిని నియమించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌ సీఎంగానూ కొనసాగుతున్నారు. ఇక ఎన్నికలు ముగియడంతో పూర్తిగా పాలనకు పరిమితం కావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

పీసీసీ చీఫ్‌ పదవి విషయంలో నిన్నామొన్నటి వరకు మధుయాష్కీ, జగ్గారెడ్డి లాంటి పేర్లు వినిపించాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సీతక్క పేరును తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం. సీతక్కను మంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగించటం ద్వారా సానుకూల ప్రభావం ఉంటుందని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడి పని చేసే వ్యక్తిగా, రేవంత్ వ‌ర్గం మ‌నిషిగా సీతక్కకు పేరుంది.

అయితే, మంత్రిగా కొనసాగిస్తూనే పీసీసీ చీఫ్‌ పదవి అప్పగిస్తారని మరో వాదన కూడా వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ నియామకంతో పాటు కేబినెట్ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీ దిశగా వరుస నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. సీతక్క ఎంపికపై త్వరలోనే పార్టీ హైకమాండ్‌తో చర్చించి.. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం.

Tags:    
Advertisement

Similar News