ఫైనల్స్ చాన్స్ ఎవరికో ? చెన్నైలో నేడే రెండో క్వాలిఫైయర్స్ పోరు!

ఐపీఎల్ -17వ సీజన్ ఫైనల్లో చోటు కోసం మాజీ చాంపియన్లు రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ తహతహలాడుతున్నాయి. క్వాలిఫైయర్స్ -2లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Advertisement
Update: 2024-05-24 08:30 GMT

ఐపీఎల్ -17వ సీజన్ ఫైనల్లో చోటు కోసం మాజీ చాంపియన్లు రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ తహతహలాడుతున్నాయి. క్వాలిఫైయర్స్ -2లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

గత ఐదువారాలుగా కోట్లాదిమంది అభిమానులను ఓలలాడిస్తూ వస్తున్న ఐపీఎల్-17వ సీజన్ హంగామా ముగియటానికి మరో రెండుమ్యాచ్ లు మాత్రమే మిగిలిఉన్నాయి.

చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈనెల 26న జరిగే టైటిల్ ఫైట్ లో పాల్గొనటానికి కోల్ కతా నైట్ రైడర్స్ ఇప్పటికే అర్హత సంపాదించగా..ఫైనల్ రెండోబెర్త్ కోసం హైదరాబాద్ సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

స్పిన్ పిచ్‌ పైన కీలక పోరు....

అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్స్ -1 పోరులో హైదరాబాద్ సన్ రైజర్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ చిత్తు చేస్తే...అదే వేదికగా జరిగిన ఎలిమినేటర్ రౌండ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును రాజస్థాన్ రాయల్స్ కంగు తినిపించడం ద్వారా క్వాలిఫైయర్స్-2 బెర్త్ ను సొంతం చేసుకొంది.

స్పిన్ బౌలర్ల అడ్డా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7-30కి ప్రారంభమయ్యే క్వాలిఫైయర్స్ -2లో రాజస్థాన్, హైదరాబాద్ జట్ల నడుమ ఆసక్తికరమైన పోరు జరుగనుంది.

బెంగళూరును చిత్తు చేసిన ఆనందంతో రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగుతుంటే...కోల్ కతా చేతిలో ఎదురైన ఘోరపరాజయం షాక్ నుంచి సన్ రైజర్స్ తేరుకొని పోటీకి దిగుతోంది.

హాట్ ఫేవరెట్ గా రాజస్థాన్....

ఈ రోజు జరిగే పోరులో సంజు శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. మ్యాచ్ వేదిక చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనువుగా ఉండటం, అదీ చాలదన్నట్లు..రాజస్థాన్ జట్టులో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ( అశ్విన్, చహాల్ ) ఉండటం కలిసొచ్చే అంశంగా ఉంది. దీనికితోడు ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, ఆవేశ్ ఖాన్ లాంటి మేటి పేసర్లతో కూడిన రాయల్స్ బౌలింగ్ ఎటాక్ సమతూకంతో కనిపిస్తోంది.

మరోవైపు..బ్యాటింగ్ పవర్ తో రికార్డుల మోత మోగిస్తూ వచ్చిన హైదరాబాద్ సన్ రైజర్స్ కు..స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉండే చెపాక్ పిచ్ పైన ఆడటం పెనుసవాలుగా మారింది.

పైగా..పేస్ బౌలింగే ప్రధాన ఆయుధంగా ఉన్న సన్ రైజర్స్ జట్టులో చెప్పుకోదగ్గ స్పిన్నర్లు లేకపోడం పెద్ద బలహీనతగా మారింది.

రైజర్స్ ఓపెనింగ్ జోడీ జోరు కొనసాగేనా?

లీగ్ దశలో అదరగొట్టిన సన్ రైజర్స్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్..తొలి క్వాలిఫైయర్ లో దారుణంగా విఫలమయ్యారు. రెండో క్వాలిఫైయర్స్ లోనూ దాదాపుగా అదే పరిస్థితి ఎదురుకానుంది.

అహ్మదాబాద్ కు భిన్నమైన వాతావరణం, పిచ్ తో కూడిన చెన్నై వేదికగా కీలక మ్యాచ్ ఆడటం రాజస్థాన్ కు చెలగాటం..సన్ రైజర్స్ కు ఫైనల్స్ సంకటంగా మారింది.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గినజట్టు ముందుగా బ్యాటింగ్ చేయడం కంటే..చేజింగ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ అంతా ఓపెనర్ యశస్వి, కెప్టెన్ సంజు శాంసన్, మిడిలార్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్, వీరబాదుడు హిట్టర్లు హెట్ మేయర్, రోవ్ మన్ పావెల్ ల పైనే పూర్తిగా ఆధారపడి ఉంది.

సన్ రైజర్స్ 10- రాయల్స్ 9

రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు చూస్తే ..సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. రాయల్స్ పైన సన్ రైజర్స్ 10 మ్యాచ్ లు నెగ్గితే...రైజర్స్ పైన రాయల్స్ కు 9 విజయాల రికార్డు ఉంది.

ప్రస్తుత సీజన్ లీగ్ దశ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ ఆఖరి బంతి విజయం సాధించగలిగింది.

అయితే..చెపాక్ వేదికగా ఆడిన 10 మ్యాచ్ ల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు 9 పరాజయాల రికార్డు ఉంది. అదే రాజస్థాన్ రాయల్స్ కు మాత్రం చెపాక్ లో ఆడిన 9 మ్యాచ్ ల్లో రెండంటే రెండు విజయాలు మాత్రమే ఉన్నాయి.

ఐపీఎల్ క్వాలిఫైయర్స్ మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ కు 5 విజయాలు, 7 పరాజయాల రికార్డు ఉంది.

టైటిల్ పోరుకు అర్హత సాధించాలంటే నెగ్గితీరాల్సిన ఈ నాకౌట్ ఫైట్ లో పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్ రైజర్స్, పదునైన బౌలింగ్ ఎటాక్ కలిగిన రాజస్థాన్ రాయల్స్ జట్లు ఓ రేంజ్ లో రెచ్చిపోతాయో..ఫైనల్స్ బెర్త్ ను ఏ జట్టు ఖాయం చేసుకోగలదో తెలుసుకోవాలంటే...మరి కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News